fbpx

రాష్ట్ర ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకునేందుకు సిద్ధం : ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం.

Share the content

గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ వర్ధంతి రోజున మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం తెలిపింది. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో ఏ.పీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ఏ.పీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.తమ న్యాయబద్ధమైన 16 డిమాండ్ల సాధన కొరకు పలు తీర్మానాలను,ఆందోళన కార్యక్రమాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సర్పంచ్, ఎంపీటీసీల వ్యక్తిగతమైన సమస్యలు కావని.. రాష్ట్రంలోని 12,918 గ్రామాలలో నివసిస్తున్న 3 కోట్ల 50 లక్షల సమస్యలను అని పేర్కొంది. తక్షణమే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్ని సర్పంచులు, ఎంపీటీసీలు రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరించాలని తీర్మానించారు. కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ మున్సిపాలిటీ – కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను బహిష్కరించాలని రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామీణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించి గ్రామ వికాస పత్రాన్ని రూపొందించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఛలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ రాజకీయాల కతీతంగా చేపట్టాలని తీర్మానించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల ముందు “ధర్నాలు” చేయాలని తెలిపారు. 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు…. లేనిపక్షంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు,ఎంపీపీలు,కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ అందరం రాజకీయాలకతీతంగా ఐక్యమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఈ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మహాత్మా గాంధీ వర్ధంతి లోపు న్యాయబద్ధమైన గ్రామీణ ప్రజల 16 డిమాండ్లు ఆమోదించకపోతే… రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ రాజకీయాలకతీతంగా ఐక్యమై “అధికార పార్టీకి మన తడాఖా చూపించి …తగిన విధంగా బుద్ధి చెప్పాలని” పిలుపునిస్తూ రాష్ట్ర కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *