fbpx

షర్మిల వ్యూహంలో మలుపులెన్నో!!

Share the content

వైయస్ఆర్టిపి అధ్యక్షురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అన్న ప్రశ్నకు అనేక రకాల సమాధానాలు అనేక రకాల ప్రచారాలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. ఆంధ్రజ్యోతిలో ఇటీవల వచ్చిన కథనంతో ఈ విషయం వెలుగు చూసింది. వరుసగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో భేటీ అవుతుండడం, శివకుమార్ ప్రత్యక్షంగా కాంగ్రెస్ అగ్ర నాయకులతో టచ్ లో ఉండడం చూస్తుంటే షర్మిల ఏదో రాజకీయ ప్రణాళికతోనే ఆయనను కలుస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న షర్మిల వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తానని ఇప్పటికే చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో వరుసగా భేటీ అవ్వడం, మళ్లీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు కీలకమైన బాధ్యతలోకి షర్మిల వెళ్తారు అన్న వార్తలు ఇప్పుడు రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి.

ఎస్సీ ఓటు బ్యాంకు తిప్పగలిగితే

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అయిన తర్వాత ఎస్సీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి వైపు మళ్ళింది. దీంతోపాటు మైనార్టీల ఓటు బ్యాంకు కూడా వైసిపి అందిపుచ్చుకుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లు ఇప్పుడు వైసీపీ ప్రధాన బలం. వారిని కచ్చితంగా టర్న్ చేయాలి అన్నది ఓ ప్రణాళికగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకు జగన్కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉండడంతో దానిని అందిపుచ్చుకొని ఖచ్చితంగా ఆయన చెల్లిని దీనికి పావుగా ఉపయోగించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నకు దీటుగా ఎదుర్కొనేందుకు చెల్లి అయితేనే మాస్ ఓటింగ్ పడుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ కు ఎంత ఇమేజ్ ఉందో కూతురుగా వైఎస్ షర్మిల కూడా అంతే ఇమేజ్ ఉంది. దీనిని కచ్చితంగా ఉపయోగించుకోవాలి అన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నేతలు అంతా పార్టీకి దూరమవుతున్న వేళ ఈ కొత్త ఎత్తుగడ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్ వైభవం తీసుకురావచ్చు అని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ క్రీస్తు బోధనలు చేస్తూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు దగ్గరగా ఉన్నారు. దీంతో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలోకి తీసుకువస్తే ఆ పాచిక కచ్చితంగా పారుతుంది అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమెను రంగంలోకి దింపుతారా లేక ముందుగానే ఈ చర్య ఉంటుందా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *