fbpx

ప్రపంచ వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలి : సంయుక్త కిసాన్ మోర్చా

Share the content

భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని వసంత మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు క్విట్ డబ్ల్యూటీవో డే సందర్భంగా ఏలూరులో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం డబ్ల్యుటివో ఒప్పంద ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న క్విట్ డబ్ల్యూటీవో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, బి కే యం యు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబా, ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ. అప్పలరాజు మాట్లాడుతూ….అబుదాబిలో జరుగుతున్న డబ్ల్యూటీవో సమావేశాలలో రైతాంగానికి, కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధం కావడం దారుణమని విమర్శించారు.

దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం తగదన్నారు. ఈ ఒప్పందాల వలన మద్దతు ధరలు, పంటల కొనుగోలు వ్యవస్థలు, దేశ ఆహార భద్రత చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థలు ధ్వంసం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు మద్దతు ధరలు కల్పించాలని మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని ఒకవైపు దేశంలో రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలకు సిద్ధం కావడం దుర్మార్గమన్నారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో దేశంలో పంటల ధరలు పడిపోయి రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్, కొబ్బరి తదితర పంటలకు ధరలు పడిపోవడానికి ఈ ఒప్పందాలే కారణమని విమర్శించారు.

ఆహార ధాన్యాల సేకరణ నుండి ప్రభుత్వాలు తప్పుకుంటాయని చెప్పారు. వ్యవసాయ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని అన్నారు. డబ్ల్యూటీవో ఒప్పందాల నుండి కేంద్ర మోడీ ప్రభుత్వం బయటికి రాని పక్షంలో ప్రజలు ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దన్నారు. ఉపాధి హామీ పథకం సంవత్సరానికి 200 రోజులకు పెంచి కనీస వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, బికేఎంయు, సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు పుప్పాల కన్నబాబు, బి జగన్నాథం, సున్నా వెంకట్రావు, జె.గోపి, పోలా వెంకట భాస్కర్,జె. కోటేశ్వరరావు,ఇ.మాధవ పొటేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, రజని, ఆర్. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *