fbpx

ఎవరూ తగులబెట్టకపోతే రత్నాచల్ ఎక్సప్రెస్ ఎలా కాలిపోయింది..?

Share the content

సుదీర్ఘ విచారణ అనంతరం రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎవరు తగలబెట్టారు అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 2016 జనవరి 31న తుని సమీపంలో రైలు తగులబడటం జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం నేపథ్యంలో, జరిగిన సభకు హాజరైన వారే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తో పాటు ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజా పైన అప్పట్లో కేసులు నమోదయ్యాయి. అయితే రత్నాచల్ ఎక్సప్రెస్ దహనం కేసును రైల్వే కోర్టు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కొట్టి వేసింది.

ఛార్జ్ షీట్లోనే లోపాలు

రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసుకు సంబంధించి చార్జి షీట్ నమోదులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు చాలా తాత్సారం చేశారు. 2016 లో కేసు నమోదు అయితే 2021లో చార్జీ షీటు నమోదు కావడం విశేషం. దీనిపైన ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు దర్యాప్తుకు ఎందుకు అంత సమయం తీసుకున్నారు.. చార్జిషీట్ నమోదుకు అంత సమయం ఎందుకు పట్టింది అన్నది అర్థం కాని ప్రశ్న. కేసు కొన్ని కులాలతో ముడి పడింది కావడంతో దర్యాప్తు ఆలస్యమైందని రైల్వే పోలీసులు చెబుతున్నప్పటికీ, దీని వెనుక కొందరిని రక్షించే ఏర్పాటు జరిగిందన్నదీ ప్రధాన ఆరోపణ. ముగ్గురు సిఐలు మారినప్పటికీ దర్యాప్తు మాత్రం పూర్తి చేయలేకపోవడంతోని చార్జిషీటు బాగా ఆలస్యమైంది. రైలు దహనం అయిన సమయంలో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వారిని ప్రధాన సాక్షులుగా కూడా తీసుకోలేదు. ఇది కూడా రైల్వే పోలీసులు తప్పిదంగానే భావించాలి. ప్రత్యక్షంగా చూసిన వారిని వదిలేసి, బయటివారిని సాక్షులుగా తీసుకోవడం వల్ల కేసు వేగిపోయింది అన్నది న్యాయ నిపుణుల మాట.

ముద్రగడ కోసమేనా?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలో రక్షించేందుకే వైసీపీ ఈ కేసులో అధిక జోక్యం చేసుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపుల ఓట్లలో ఒకసారి భారీగా చీలిక వచ్చి, జనసేనకు అనుకూలంగా ఉన్న సమయంలో ముద్రగడకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తే అది కచ్చితంగా అనుకూలంగా మారుతుంది అని లెక్కలు వేస్తున్నారు. దీనిని బట్టి ఇటీవల ప్రభుత్వం కూడా తుని ఘటనలో కేసులను ఎత్తివేసింది. ఇప్పుడు రైల్వే కోర్టు కూడా కేసు కొట్టి వేయడంతో పెద్ద రిలీఫ్ దొరికినట్లు అయింది. కేసులో ఉన్న వారిని సైతం వైసీపీలోకి తీసుకువచ్చే ఆలోచన కొందరు పెద్దలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ కేసు ఎప్పుడు రాజకీయంగా అనేక మలుపులు తిరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *