fbpx

లగడపాటి ఎటు వైపు?

Share the content

రాష్ట్ర విభజన సమయంలో అందరి కళ్ళు తల వైపే తిప్పుకున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విభజిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో సవాల్ చేసిన లగడపాటి తర్వాతే ఎన్నికల్లో తన సవాళ్లు నిలుపుకొని రాజకీయాల నుంచి పూర్తిగా దూరం ఉన్నారు. వ్యాపార కార్యకలాపాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. అయితే ఎట్టకేలకు రాష్ట్ర విభజన గాయాల నుంచి కోలుకొని దశాబ్దం అవుతున్న తరుణంలో లగడపాటి మళ్లి రాజకీయ పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏ పార్టీ నుంచి ఆయన రాజకీయ పునరాగమనం చేస్తారు అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు.

వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని లగడపాటి భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై తన అనుచర గణంతో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని అన్ని విధాలా సహకరించాలని అనుచరులను కోరారు. ప్రస్తుతం ఏ పార్టీలో కూడా క్రియాశీలకంగా లేని లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలుస్తారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పొత్తులు ఓకే అయితే ఆయన మళ్లీ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంటుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేతకు దగ్గరైన లగడపాటి తర్వాత కూడా దానిని కొనసాగించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతతో చాలా సఖ్యతగా నడిచిన లగడపాటి 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుంది అన్న సమాచారం మేరకు ఆయన మళ్లీ యాక్టివ్ కావాలని ఆశిస్తున్నారు. మళ్లీ విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు కాయమే అన్న ప్రచారం కూడా విజయవాడ నగర వ్యాప్తంగా వినిపిస్తోంది. మరోపక్క ఆయనకు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తోను మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్యవాదం నెత్తిన పెట్టుకొని ఇద్దరు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో ఉండడంతో లగడపాటి అటువైపు ఏమైనా వెళ్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మోర్ పార్టీలకు సంబంధించి పొత్తులు ఖరారు అయితే బిజెపి అనుకున్న మేరకు ఎంపీ స్థానాలను అధికంగా అడిగే అవకాశం ఉంది. దీంతో విజయవాడ బరిలో లగడపాటి బిజెపి తరఫున బరిలోకి దిగుతారు అన్న మరో లెక్క ఉంది. దీంతో ఇప్పుడు లగడపాటి ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *