fbpx

తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏమిటో??

Share the content

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు మూలఖత్ ఫిక్స్ అయ్యింది. తెలంగాణలోని పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల స్థితిగతులను చంద్రబాబుకు కాసాని వివరించినన్నారు. దీంతోపాటు తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, పరిణామాలను చంద్రబాబుకు వివరించిన అనంతరం జ్ఞానేశ్వర్ వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి చంద్రబాబుకు తన మనసులోని మాట చెప్పనున్నారు. దీనిపై చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొని తెలంగాణలో పోటీ చేయాలా వద్దా అనే విషయం ప్రకటించనున్నారు.

** తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా హైదరాబాదులో సుమారు ఐదు నియోజకవర్గాల్లో సెటిలర్స్ ప్రభావం, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. దీంతోపాటు హైదరాబాద్ కు సాఫ్ట్వేర్ తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది అన్న మాట కూడా యువతలో ఉంది. వీటన్నింటికీ తోడు చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా సానుభూతి ఓట్లు పడతాయి అని భావిస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని కాసాని వివరిస్తారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదా లేక ఏదైనా పార్టీతో పొత్తులో వెళ్లడం మంచిదా అనే విషయాలను కూడా పూర్తిస్థాయిలో చర్చించి ఒకటి రెండు రోజుల్లో పోటీ విషయంలోనూ లేదా పొత్తుల విషయంలో చంద్రబాబు స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొదటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అన్నది కీలకము కానుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని ఇప్పటికే ప్రకటించిన సమయంలో ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలాగే బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ కలిశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు ఇవ్వాలని కోరారు. ఫలితంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో పాటు కేంద్ర సహాయం కూడా ఉంటుందని భరోసా ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా బిజెపికి అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. చంద్రబాబు తీసుకుని నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదానిమీద ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఆధారపడి ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *