fbpx

వివేకా కేసు ఓ న్యాయ పాఠం

Share the content

భారతదేశంలో చట్టం ఉన్నవారికి ఎంత బలహీనంగా పనిచేస్తుంది లేని వారి పట్ల ఎంత బలంగా పనిచేస్తుంది అన్నది తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కేసులు తాలూకా వ్యవహారాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సొంత బాబాయి హత్య కేసులో చేతులన్నీ వైయస్ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్న దాని వెనుక నడిపిస్తున్న వ్యక్తులు ఎవరిని ఇప్పటికి బయటపడలేదు. వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి నాటకీయ పరిణామాలే సాగాయి. 2019 ఎన్నికల్లో వైయస్ వివేకానంద హత్య కేసును రాజకీయంగా వాడుకున్న వైయస్ జగన్ తర్వాత దానిని పూర్తిగా గాలికి వదిలేయడంతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో హైకోర్టులో వేసిన సిబిఐ విచారణ పిటిషన్ను వెనక్కు తీసుకోవడం అప్పట్లోనే సంచలనం అయింది. దాని తర్వాత కోర్టు జోక్యంతో సిబిఐ రంగ ప్రవేశం చేయడం దోషులు ఒక్కొక్కరుగా వైఎస్ ఫ్యామిలీలోని వారే అని తేలడంతో ఎన్నో సంచలనాలకు ఈ కేసు ప్రధాన కేంద్రంగా మారింది. ఓ కేసులో రాజకీయమైన జోక్యం లేదా రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లయితే ఆ కేసు ఎలా నీరు గారి పోతుంది భారతదేశంలో అత్యున్నత వ్యవస్థలు సైతం ఏమీ చేయలేని పరిస్థితికి ఎలా వెళ్ళిపోతాయి అన్నది ఓ న్యాయపాఠంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని మలుపులను భవిష్యత్తు తరాలకు చెప్పొచ్చు. ముఖ్యంగా కేసులో బయటకు వచ్చిన పేర్లు తర్వాత కోర్టులో సమర్పించిన సాక్షాలు, బెయిల్ కోసం వేసిన పిటిషన్లు దాని తాలూకా వాదనలు, నిందితుల నాటకీయ అరెస్టులు విడుదల, సిబిఐ అధికారుల మార్పులు చేర్పులు, కేసులో కోర్టుకు సమర్పించిన సాక్షాలు చెల్లవని సిబిఐ ఒప్పుకోవడం, స్వయంగా ముఖ్యమంత్రి కీలక సమయాల్లో ఢిల్లీ వెళ్లి పెద్దలతో మంతనాలు జరపడం వంటివన్నీ ఈ కేసులో ఓ సినిమాను తలపించే విధంగా ఉంటాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు అసలు కారణాలను ఇప్పటివరకు కనుక్కో పోవడం సిబిఐ పనితీరుకు కొలమానం. ఎంతోమంది సాక్షులను హత్య కేసులో ప్రధానంగా చేర్చిన సిబిఐ నిందితులను విచారించిన సమయంలోనూ దీనికి గల కారణాలను పూర్తిస్థాయిలో బయట పెట్టలేకపోయింది. కేసులో కీలకమైన విచారణ అంశాలను లీకులు ఇస్తున్న వైనం కూడా ఈ కేసులో ప్రధానమైనది అని చెప్పొచ్చు.

ఆమె లేకుంటే

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి చేసిన పోరాటం చాలా అమోఘం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవస్థలను పూర్తిస్థాయిలో ప్రభావితం చేయగల వ్యక్తులతో ఆమె చేసిన పోరాటం కచ్చితంగా గుర్తుండిపోతుంది. న్యాయపరంగా పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా ఎదుర్కొని ఆమె మొదటి నుంచి ముందుకు సాగారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో జరిగిన అంశాలతో పాటు తర్వాత తనకు ఎదురైన కుటుంబ స్వీయ అనుభవాలను పూర్తిస్థాయిలో కోర్టుకు విన్నవించడంలో గాని తండ్రి తాలూకా హత్యకు వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరో సమాజానికి చెప్పే విషయంలో గానీ సునీత ధైర్యం ఈ కేసులో కీలకంగా మారింది. తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పటికీ ఏమాత్రం తోనకకుండా బెనకకుండా కేసును ముందుకు తీసుకు వెళ్ళగలిగారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సునీత గట్టిగా నిలబడి కేసు విషయంలో అసలు విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా చేయగలగడంలో విజయం సాధించారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో కోర్టు తీర్పు ఎటు వచ్చిన ఏం జరిగినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కేసులో అసలు నిందితులు జరిగిన అసలు పరిణామాలు ప్రజలకు చేరవేయడంలో సునీత మాత్రం నైతిక విజయం సాధించారు అని చెప్పొచ్చు. 2019లో జగన్కు ఎంతో అనుకూలించిన వైయస్ వివేకా కేసు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఓ ప్రభావం చూపించవచ్చు అన్నది రాజకీయ వర్గాల మాట. దీనిని ప్రతిపక్షాలు సైతం అంతే స్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్తే ఖచ్చితంగా దీనిలో జగన్ కు రాజకీయంగా మైనస్ మార్కులు పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *