fbpx

అంతుచిక్కని మరణాలు.

Share the content

విద్యావ్యవస్థలో అద్భుతాలు జరుగుతున్నాయని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆగస్టు వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీ ఆర్ ) సర్వే ద్వారా విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. 2021-22 విద్య సంవత్సరంలో 62,754 మంది విద్యార్థులు మృతి చెందినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో ఉన్న15,104 గ్రామ సచివాలయాలు, 13,676 వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా ఆగస్టు వరకు జరిగిన జి ఆర్ సర్వేలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూశాయి. విద్యాశాఖ ద్వారా జరిగిన సర్వేలో రాష్ట్రంలోని పాఠశాలలో 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు లెక్కలు వచ్చాయి. వారిలో డ్రాప్ అవుట్స్ 3,88,000గా నిర్ధారణ అయింది. వీరిలో ఐదు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు వివిధ కారణాల రీత్యా మృతి చెందినట్లు క్షేత్రస్థాయి నివేదికలో తేలింది. ఇంతమంది విద్యార్థులు మృతి చందడం వెనుక ఉన్న అసలు కారణాలు ప్రభుత్వం బయట పెట్టడం లేదు. విద్యార్థుల పోషకాహార లోపం వల్ల మృతి చెందారా…? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది. స్కూల్ డ్రాప్ అవుట్స్ గణనీయంగా పెరగడం ఒక ఎత్తు అయితే, సర్వేలో మరొక భయంకరమైన వాస్తవం బయటపడింది. రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది కనిపించకుండా పోయారని సర్వే చేసిన వారు నివేదికలో పేర్కొన్నారు.

ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు మృతి చెందడం, కనిపించకుండా పోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న విద్యా సంస్కరణలు మరెక్కడా జరగడంలేదని ముఖ్యమంత్రి ప్రతిసారి చెబుతున్నారు. ఇంతమంది విద్యార్థులు మృతిచెందితే కనిపించకుండా పోతే కనీసం దానిమీద మాట్లాడే బాధ్యత ప్రభుత్వం నుండి ఎవరు తీసుకోవడం లేదు. విద్యారంగానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం చివరకు సాధించింది విద్యార్థులు అంతులేని మరణాలుగా క్షేత్రస్థాయి సర్వే చెబుతోంది. మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది పాఠశాలలో సైతం గంజాయి సరఫరా జరుగుతుందంటూ స్వయంగా తల్లిదండ్రులు వెల్లడిస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ గంజాయి మత్తులో ఆరోగ్యం పాడై పిల్లలు మృతి చెందుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *