fbpx

వైసిపి ఎంపీ అభ్యర్థులు వీరే

Share the content

అధికార పార్టీ వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థుల వేటలో పడింది. ముఖ్యంగా బలమైన ఎంపీ అభ్యర్థులను బరిలో నిలపాలని ఆరాటపడుతోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజలకు సుపరిచితమైన వ్యక్తులను రంగంలోకి దింపితే మెరుగైన ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీకి లోక్ సభకు సంబంధించి బలమైన అభ్యర్థులు దొరకలేదు. దీంతో అప్పటికప్పుడు కొన్ని సర్దుబాట్లు చేసి ఉన్న అభ్యర్థులను బరిలో నిలిపింది. జగన్ వేవ్ లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ బలమైన అభ్యర్థులు ప్రజలకు సుపరిచితులైన వారు ఎవరు కనిపించలేదు. ఈసారి అలాంటి ఫార్ములాను పక్కనపెట్టి పూర్తిగా ప్రజలకు తెలిసినవారు కీలకమైన నేతలను లోక్ సభ పంపాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా కొన్ని కీలకమైన స్థానాల నుంచి మాజీ మంత్రులను సైతం రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరిని ఎంపీలుగా??

మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఈసారి ఏలూరు లోక్ సభ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. ఇటీవల ఏలూరు నియోజకవర్గంలో సర్వేలో సైతం ఆళ్ల నానికి ప్రతికూల ఫలితాలు రావడంతో కచ్చితంగా ఆయనను ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇక మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కొరసాల కన్నబాబుని సైతం వచ్చే ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ కు పంపాలని భావిస్తున్నారు. కాకినాడ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందున కన్నబాబుకు అక్కడ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తిని రంగంలోకి దింపితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కన్నబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. ఇక మంత్రి పినిపే విశ్వరూపం అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అమలాపురం నియోజకవర్గం లో మంత్రి విశ్వరూప్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పాటు సర్వేలోనూ అదే తేలడంతో జగన్ ఈసారి ఆయనను పార్లమెంటుకు పంపితేనే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మాజీ మంత్రి భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావును కూడా అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అయితే వీరంతా జగన్ చెప్పినట్లు కచ్చితంగా ఆయా లోక్ సభ స్థానాలు నుంచి పోటీ చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. అయితే వైసీపీ పెద్దలు మాత్రం జగన్ నిర్ణయాన్ని ఎప్పటికీ ఆయా నేతలతో పంచుకున్నారని కచ్చితంగా ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి తమ నిర్ణయం చెప్పాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది నేతలు తర్వాత ఈ విషయంలో మాట్లాడదామని మాట దాట వేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *