fbpx

కోడెల శివరాం రాజకీయం ముగిసినట్లే…

Share the content

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇప్పుడు అదే పార్టీలో అంత్య దశను ఎదుర్కొంటుంది. కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి కేంద్రంగా రాజకీయాలు సాగించిన కోడెల కుమారుడు శివరాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విడాలా వద్దా అని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునుంచి కోడెల శివరాం కు దాదాపు టికెట్ తిరస్కరించినట్లే అని భావిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త వారిని రంగంలోకి దింపడం, ఆర్థికంగా స్థితి మంతులుగా ఉన్న వారిని వెతికి తీసుకువచ్చి మరి అక్కడ యాక్టివ్ చేయడం చూస్తుంటే భవిష్యత్తులోనూ కోడెల శివరాం ను టిడిపి దగ్గరికి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడానికి శివరాం ప్రయత్నించారు తప్ప, బలమైన మాస్ ఇమేజ్ను ఆయన సంపాదించుకోలేకపోయారు. కనీసం అనుచరుగనాన్ని సైతం తయారు చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఎంతసేపు ఆర్థిక వనరులు ఎక్కడ వస్తాయి అన్న దృష్టి తప్ప, రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన దారిని శివరాం ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఇదే ఆయనకు ప్రతికూలంగా మారింది.

ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయడమే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సర్వే రిపోర్టులు తెప్పించుకుంటారు. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితిని వివరంగా తెలుసుకునేందుకు నాయకుల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు ఆయన నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సత్తెనపల్లి నియోజకవర్గం పరిస్థితిపై సర్వేలో కోడెల శివరాం ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే ఘోరంగా ఓటమిపాలయ్యే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు వచ్చాయి. దీంతోపాటు పార్టీ నాయకులు ఎవరు ఆయన పై సానుకూలంగా లేరని తెలుస్తోంది. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత కోడెల శివరాం రాజకీయంగా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఉన్నంత మేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మీద మాత్రమే ఆయన దృష్టి నిలిపారు. అలాగే పార్టీ పెద్దలను సైతం ఏమాత్రం గౌరవించలేని నేతగాను ఆయనకు అపవాది ఉంది. పార్టీలో సీనియర్లను ఏమాత్రం పట్టించుకోరని అలాగే మండల నాయకులు కూడా ఆయన దగ్గరకు కూడా చేరనివ్వరని పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. కనీసం కార్యకర్తలకు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉండదని, దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలకు లెక్కే లేదని పార్టీ నేతలు చెప్పడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై సీరియస్గా దృష్టి సారించారు. కచ్చితంగా కోడెల శివరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతూ వచ్చారు.

కొత్తవారికి అవకాశం…

సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రంగా బలమైన ఎన్ఆర్ఐ కు టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో శివరాం తనకు వస్తున్న ముప్పును ముందుగా గ్రహించి ఇటీవల టిడిపి అధినేత పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇది ఆయనకు పూర్తిగా రాజకీయ భవిష్యత్తును దూరం చేసే చర్యగా భావిస్తున్నారు. టిడిపి కనుక ఆయనను దూరం పెడితే, మరి ఇతర పార్టీ కూడా ఆయన తీసుకునే ఉద్దేశంలో ఉండదని టిడిపి కార్యకర్తలు చెప్పడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *