fbpx

ఇంకా రాజకీయ హడావిడి మొదలు కాలేదు!

Share the content

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ నుంచి జంపింగ్లు ఇక్కడి నుంచి మొదలు కానున్నాయి. అధికార పక్షం నుంచి విపక్షానికి అలాగే విపక్షం నుంచి అధికార పక్షానికి ఆశావహులు వరుస కట్టనున్నారు. ఎక్కువగా వైసిపి నుంచి టీడీపీలోకి వలసలు కనిపిస్తున్నాయి. అయితే టిడిపి నుంచి అధికార పార్టీలో కూడా వలసలు కొన్ని ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక మూడో పక్షం జనసేనలోకి వలసలు చాలా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహులు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ఉన్న పార్టీలో ఉందామా లేక మరో పార్టీలోకి వెళ్దామా అనే చర్చలు అంతటా సాగుతున్నాయి.

అవకాశం ఉన్న వారెవరు?

టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లే వారిని పరిశీలిస్తే ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎక్కువమంది కనిపిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం వైసీపీలోకి చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. టిడిపి ఈసారి సత్తెనపల్లి నుంచి టికెట్ కాదు అని తెగేసి చెప్పడంతో పార్టీని వీడాలని శివరాం నిర్ణయించుకున్నారు. వైసీపీలోకి వెళ్లాలని ఇప్పటికే రాయబారాలు మొదలుపెట్టారు. అయితే వైసీపీ నుంచి కూడా ఆయనకు టికెట్ హామీ దక్కలేదు అన్నది సమాచారం. అయితే సొంత పార్టీలో కొనసాగితే ప్రతిష్టకు పూర్తిగా మచ్చ వచ్చే అవకాశం ఉండడంతో వైసిపి లోకి చేరి కనీసం ఎమ్మెల్సీ అవకాసం ఆయన ఇవ్వాలని శివరాం బేరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి టికెట్ కేటాయింపు కుదరదు అని అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా పక్కన పెట్టారు. విజయవాడ నుంచి కేశినేని నాని దాదాపు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడం ఖాయం అయింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉంది. గుంటూరు నుంచి రాయపాటి సాంబశివరావు కొడుకు సైతం పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ విషయంలో ప్రస్తుతం పరిస్థితి అంతా గుమ్మనంగా ఉంది. అయితే భూమా అఖిలప్రియ పార్టీ మారే అవకాశం కొట్టి పారేయలేం. ఇటీవల ఏవి సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు క్రమంలో ఆమెకు పార్టీ అధిష్టానం నుంచి తీవ్రమైన మందలింపులు వచ్చాయి. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేది అనుమానమే. దీంతో భూమా అఖిలప్రియ పార్టీ మారతారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

టీడీపీలోకి…??

అధికారపక్షం నుంచి టీడీపీలోకి వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ టికెట్ హామీ మాత్రం వారికి దక్కడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు కలిసి వెళ్లాలని టిడిపి భావిస్తున్న తరుణంలో టికెట్లు పంపకాల విషయంలో ఖచ్చితమైన హామీ టిడిపి అధిష్టానం ఇవ్వలేకపోతోంది. దీంతోనే ఎప్పటికి టిడిపిలోకి భారీగా చేరికలు నమోదు కాలేదు. అధికారపక్షంలో ఉన్న సంతృప్తిని పరిశీలిస్తే చాలామంది వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మధ్య రాయబారాలు ఇప్పటికే మొదలైనప్పటికీ అధిష్టానం నుంచి మాత్రం స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారు. పార్టీలోకి వచ్చిన వారినందరినీ చేర్చుకోకుండా ఖచ్చితంగా గెలిచే వారిని మాత్రమే చేర్చుకోవాలి అన్నది లోకేష్ అభిప్రాయం. దీనిని కచ్చితంగా పాటించి తీరాలి అని ఆయన భావిస్తున్నారు. దీంతో టీడీపీలోకి వేగంగా చేరికలు నమోదు కావడం లేదు. అయితే రాబోయే రెండు మూడు నెలల్లో టిడిపిలోకి అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టిడిపిలోకి ఎవరు వెళ్తారు అన్నది చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ, త్వరలోనే అంతా బయటపడతారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *