fbpx

గన్నవరం తీరులోనే నరసరావుపేట!

Share the content

గన్నవరం సీన్ లాంటిదే నరసరావుపేట ఎంపీ స్థానంలోనూ జరగనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి అదే స్థానం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల టిడిపి యువనేత లొకేషన్ ఓ కార్యక్రమంలో కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలోనే పార్టీ మారుతారు అని అప్పట్లోనే జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో కూడా ఎంపీ ఏమాత్రం దానిని పట్టించుకోకుండా కనీసం వార్తను ఖండించకుండా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అని తెలుస్తోంది. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నరసరావుపేట ఎంపీ స్థానంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఎంపీకి పూర్తిగా ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి ఉంది. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి పోటీలోనే ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎంపీ కి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న సొంత పార్టీ నేతలకు మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న విడుదల రజిని వర్గానికి ఎంపీ వర్గానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వీరి అనుచరులు చాలాసార్లు బహిరంగంగాను తలపడ్డారు. మరోవైపు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తోను ఎంపీకి పూర్తిగా దూరం. సత్తెనపల్లి లో ఏ కార్యక్రమానికి కూడా ఎంపీ హాజరు కాని పరిస్థితి అక్కడ ఉంది. ఇక మాచర్లలో పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే హవా. దీంతోపాటు పెదకూరపాడు నరసరావుపేట నియోజకవర్గల్లోను పార్టీ నాయకులతో శ్రీకృష్ణదేవరాయలు ఉప్పు నిప్పుల ఉంటారు. రాజకీయ లౌక్యం తెలియని శ్రీకృష్ణదేవరాయలు ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు అని పేరు. దీంతోనే ఎవరికి ఆయనంటే పడదు అని… వైసీపీ నాయకుల తీరు ముందు నుంచి ఆయనకు గిట్టదు అని ప్రచారం ఉంది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున నరసరావుపేట నుంచి పోటీ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరికకు ఇప్పటికే లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా చంద్రబాబును త్వరలోనే ఆయన కలిసి పార్టీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *