fbpx

సత్యప్రభపై సొంతపార్టీలోనే అసత్య ప్రచారం

Share the content


తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విచిత్ర రాజకీయం చేస్తోంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న వరపుల రాజా ఆకస్మిక మృతి తర్వాత ఆ నియోజకవర్గంలో కీలకమైన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూసే వారే కరువయ్యారు. అయితే పార్టీ వెంటనే స్పందించి వరపుల రాజా భార్య సత్యప్రభను పార్టీ ఇన్చార్జిగా నియమించడమే కాకుండా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమన్వయం చేసుకొని పార్టీని పటిష్టం చేయాలని సూచించింది. ఆమె కూడా అంతే ఉత్సాహంతో రాజకీయాలకు కొత్త వ్యక్తి అయినా సరే తన వంతుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆమెకు అన్ని విధాల సహకరించాల్సిన పార్టీ సీనియర్లతోనే ఇప్పుడు ఆమె తిప్పలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పిఠాపురం, మరోవైపు తుని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ సొంత నాయకులు ఆమెకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.


తుని నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్వే రిపోర్టులు కృష్ణుడికి వ్యతిరేకంగా రావడంతో యనమల రామకృష్ణుడు కుమార్తే యనమల దివ్యకు టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన యనమల కృష్ణుడు అధికార పార్టీకి చెందిన కీలక నాయకులను కలిసి తన రాజకీయ భవితవ్యంపై మాట్లాడారు. అయితే అక్కడ నుంచి కూడా సరైన హామీ రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. తునిలో అన్న కూతురిని ఇబ్బంది పెట్టలేక పక్కనే ఉన్న ప్రత్తిపాడుపై దృష్టి సారించారు. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని సత్యప్రభకు ప్రతిపాడు నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తోన్న తనకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వదనే అక్కసుతో ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెడుతున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న తుని నియోజకవర్గంలో తనను కాదని ప్రతిపాడు నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన సత్యప్రభకు టికెట్ కేటాయించడంపై ఆమెపై అక్కసుతో నియోజకవర్గంలో వర్గపోరుకు తెరదీస్తూ… సత్యప్రభను ముప్పు తిప్పులు పెడుతున్నారు.
యనమల కృష్ణుడు ప్రతిపాడు నియోజకవర్గంలోని పార్టీలో వర్గాలు పోషిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ యనమల కృష్ణుడు సొంత నాయకులను తయారుచేసి, సత్యప్రభపై దుష్ప్రచారానికి తెర లేపారు. సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాలకు సరిపోరని కచ్చితంగా ఎక్కడి నుంచి బలమైన నాయకుడు అవసరం అవుతారంటూ సొంత పార్టీలోనే కొందరు నాయకులను అధిష్టానానికి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. మరోపక్క పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు వర్మ సైతం తన రెండో ప్రాధాన్య నియోజకవర్గంగా ప్రతిపాడునే ఎంచుకున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖరారు అయితే కచ్చితంగా పిఠాపురం సీటును జనసేన అడిగి అవకాశం ఉంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ టీ టైం అధినేత ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం ఇన్చార్జిగా బరిలోకి దింపారు. దీంతోపాటు ఉదయ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో కచ్చితంగా ఆ సీటును జనసేన అడిగే అవకాశం 100% ఉంది. దీనిని ముందుగానే గ్రహించిన వర్మ సైతం తనకు రెండో ప్రాధాన్య నియోజకవర్గంగా ప్రత్తిపాడు మీద కన్నువేశారు. దీంతో ఆయన కూడా ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న సత్య ప్రభను అన్ని వైపులా ఇబ్బంది పెట్టేలా సొంత పార్టీలోనే రకరకాల గ్రూపులను తయారు చేస్తున్నారు. వర్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడం ప్రతిపాడు నియోజకవర్గంలో తన అనుచరగణం ఉండడంతో సొంత పార్టీ బాధ్యురాలిని, అందులోనూ భర్త చనిపోయి ఆరు నెలలు కూడా కానీ ఓ మహిళను పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం, రాజకీయంగా ఆమెను తొక్క వేయాలని ఇరువైపుల పార్టీ సీనియర్ నాయకులు చూడడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కుదిపేస్తోంది. ఈ పరిణామాలను బయట నుంచి చూస్తున్నా తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం నైతిక మద్దతు తెలపకపోవడంతో అసహనానికి గురవుతున్న సత్యప్రభ మానసిస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రతిపాడు లాంటి నియోజకవర్గం లో కచ్చితంగా సత్యప్రభకు వరపుల రాజా మృతి చెందిన సానుభూతితో పాటు పటిష్టంగా పనిచేస్తున్నారు అన్న పేరు, గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ లు ఉన్న నేపథ్యంలో రెండు నియోజకవర్గాల నాయకులు ఆమెను ఇబ్బంది పెట్టడంపై ఆమె అనుచరులు అసహనంతో ఉన్నారు. ఇప్పుడు ఈ మూడు ముక్కలాట ప్రతిపాడు నియోజకవర్గ సినిమా తెలుగుదేశం పార్టీకి ఏమేర నష్టం చేకూరుస్తుంది ఏ మేర లాభం చేకూరుస్తుంది అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *