fbpx

పాలకొల్లుకు సెట్ అయినట్లేనా?

Share the content

ఎవరు ఊహించిన రీతిలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం మీద వైసిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రస్తుత ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ను పాలకొల్లు ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించి కొత్త వ్యక్తిగా బరిలోకి నిలిచిన గూడాల రవి ని అనూహ్యంగా రంగంలోకి దింపింది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కు కచ్చితంగా వచ్చి ఎన్నికల్లో టికెట్ వస్తుందని అంతా భావించారు. శ్రీనివాస్ కూడా చాలాసార్లు వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు నుంచి నేనే పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పటికే పాలకొల్లు నియోజకవర్గం లో అధికార పార్టీలో బోలెడు చీలికలు ఉన్నాయి. మాజీ జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబుతో శ్రీనివాస్ వర్గానికి బొత్తిగా పడటం లేదు. దీంతో నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసిసిబి బ్యాంకు చైర్మన్గా, జడ్పీ చైర్మన్ గా, అనంతరం ఎమ్మెల్సీ పదవిని పొందిన కవురు శ్రీనివాస్ కు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ లోను చోటు లభించవచ్చు అన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో శ్రీనివాస్ కు రాజకీయంగా అన్ని విధాలా కలిసి వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో వైసీపీ అధిష్టానం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న గూడాల రవి అనే పారిశ్రామికవేత్తను పాలకొల్లు ఇన్చార్జిగా నియమించింది. ప్రస్తుతం పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మల రామానాయుడు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రామానాయుడు ను ఓడించాలి అంటే బలమైన ఆర్థిక సత్తా ఉన్నవారు ఉంటే బాగుంటుందని వైసీపీ అధిష్టానం భావించినట్లు కనిపిస్తోంది. దీంతోపాటు నియోజకవర్గంలో మేక శేషుబాబు, శ్రీనివాస్ వర్గాల మధ్య ఉన్న వైరాలను తగ్గించాలి అంటే కొత్త వ్యక్తిని రంగంలోకి దింపడం మంచిదని భావించి గూడాల రవికి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆక్వా పరిశ్రమలో బాగా సంపాదించిన రవి పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వారే. కాపు సామాజిక వర్గానికి చెందిన రవి అయితే కచ్చితంగా నిమ్మల రామానాయుడుకు గట్టి పోటీ ఇస్తారని వైసీపీ అధిష్టానం భావించింది. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో భీమవరం ఎన్నికలను కూడా ఆర్థికంగా నిర్వహించే బాధ్యతను రవికే అప్పగించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే పూర్తిస్థాయిలో రవి మీద ఆర్థిక భారం మోపి, అక్కడి నుంచి కూడా తమ అభ్యర్థిని గెలిపించుకు రావాలని పూర్తిస్థాయి షరతులతోనే ఇన్చార్జి పదవి అప్పగించినట్లు సమాచారం. రాజకీయాలకు పూర్తిగా కొత్తగా ఉన్న రవి పాలకొల్లు నియోజకవర్గం లో ఎంత మేర పని చేస్తారు అన్నది, కార్యకర్తలను ఎలా కలుపుతారు అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *