fbpx

జగన్ ధోరణి అంతు పట్టదు!

Share the content

ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి చర్య కూడా ఆయన మానసిక స్థితిని తెలియజేసేదే… పరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దగ్గరనుంచి రాజకీయ శత్రువుల్ని పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టేవరకు జగన్ చేసిన ప్రతి చర్య కూడా ఆయన స్వభావాన్ని పూర్తిస్థాయిలో బయటపెట్టేది. తనకి అడ్డుగా నిలిచే వారిని, భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే వారిని, వచ్చే ఎన్నికలతో ఏ ఏజెండాతో ముందుకు వెళ్లాలన్న అంశం మీద జగన్ పూర్తి క్లారిటీతో ముందు నుంచి ఉన్నారు. స్వతహాగా రాయలసీమ ప్రభావం అధికంగా కనిపించనివ్వని జగన్, తన పనితీరులో మాత్రం ఆ మార్కును స్పష్టంగా కనిపించేలా చేస్తారు. ముఖ్యంగా కక్ష తీర్చుకునే వైఖరి అచ్చంగా రాయలసీమ ఫ్యాక్షన్ మానసిక స్థితిని తెలియజేస్తుంది.

రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో జగన్ స్పష్టంగా ఉంటారు. తన రాజకీయ శత్రువులు ఎవరో అందరికీ అర్థమయ్యేలాగే ప్రవర్తిస్తారు. ఆయన వైఖరి సైతం పూర్తిస్థాయిలో ప్రజలకు అర్థం అవుతుంది. జగన్ ను విపరీతంగా అభిమానించే వారికి ఇది భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇది అచ్చంగా రాయలసీమ ఫ్యాక్షన్ ఆలోచన. కచ్చితంగా మనం దెబ్బ కొట్టే ప్రతిచర్య అందరికీ అర్థం కావాలి అని ఫ్యాక్షనిస్టులు భావిస్తారు. తన శత్రువు ఎవరు అన్నది దాచుకోరు. ప్రజలందరికీ తెలిసేలా రాజకీయ శత్రువుల మీద తన కోపాన్ని ప్రదర్శిస్తారు. జగన్ కూడా అచ్చం అలాగే ప్రవర్తిస్తారు. రాజకీయ శత్రువులుగా ప్రకటించిన చంద్రబాబుతో పాటు ఆయన అనుకూల మీడియాను పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టడానికి ఆయన వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకోవడానికి ఏమాత్రం సంకోచించరు. దానికోసం ఎన్ని మాటలు పడినా ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోరు. కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్థి తన వల్ల ఇబ్బంది పడాలి అనుకునే రీతిలోనే ఆయన ప్రతి చర్య ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలిగిన ఆయన దానిని పట్టించుకోరు. ఇది ఆయనలోని రాయలసీమ వారసత్వ లక్షణాలను బయటపెడుతుంది.

జగన్ పరిపాలనలో సైతం పూర్తిస్థాయిలో వ్యాపార ధోరణినే మొదటి నుంచి ప్రదర్శించారు. ప్రజలకు అప్పటికప్పుడు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు, నేరుగా డబ్బులు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమం మీదనే ఆయన 100% దృష్టి నిలిపారు. పేద ప్రజలు ఎక్కువగా తమకు నేరుగా ప్రతి ఫలాలు అందితే ఆనందించే ప్రజలనే టార్గెట్ గా చేసుకొని ఆయన పాలన కొనసాగింది. ఎన్నికల సమయంలో ఉదయం వేళ పోలింగ్ బూత్ కు ఎవరు వచ్చి ఓటు వేస్తారో ఆ వర్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని వారిని ఆనందింప చేయడమే ప్రధానమైన లక్ష్యంగా జగన్ పరిపాలన సాగుతూ పోయింది. ఇది పూర్తిగా పక్క కమర్షియల్ వ్యాపారి ఆలోచించే ధోరణి గానే ఆయన నాలుగున్నర సంవత్సరాల పాలన కొనసాగింది. ఒకపక్క కక్ష సాధింపు రాజకీయాలు మరోపక్క వ్యాపార పరమైన సంక్షేమ పథకాలతోనే మొత్తం జగన్ వైఖరి సాగుతోంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో జగన్ వైఖరి పరాకాష్టకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *