fbpx

వైసిపి నోటి దూలకు మూల్యం ఎంత?

Share the content

ఒకపక్క చిరంజీవి మరోపక్క రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద స్టార్లు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ మంత్రుల మాటల మీద చేస్తున్న వ్యాఖ్యల మీద బహిరంగంగా అసహనం గుప్పించడం ఇప్పుడు వైసీపీని డిఫెన్స్ లో పడేస్తోంది. ముఖ్యంగా వైసిపి నాయకులు మంత్రులు, ప్రజాప్రతినిధులు వాడుతున్న భాష పట్ల మొదటి నుంచి అభ్యంతరం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం వేరు ఏకంగా బూతులు తిడుతూ వారి వ్యక్తిగత విషయాలను బయటపెట్టి ఆనందం పొందడం వేరు. వ్యక్తిగత విషయాలే విమర్శలు అనుకునే స్థాయికి వైసిపి ప్రజాప్రతినిధులు నాయకులు దిగజారిపోవడంతోనే అసలు సమస్య మొదలైంది. వైసీపీకి మద్దతు తెలపని వారు అనుకూలంగా మాట్లాడని వారు తమకు శత్రువులే అన్నట్లు వైసీపీ నాయకులు భావిస్తూ దానికి తగినట్లుగా ప్రెస్ మీట్ లు పెట్టి బూతులు తిట్టడం మొదటి నుంచి ఉంది. విపక్ష పార్టీలను పూర్తిస్థాయిలో భయపెట్టి బెదిరించి రాజకీయాలు చేయాలని, మాట్లాడాలంటేనే కనీసం ఎవరు ముందుకు రాని పరిస్థితికి తీసుకురావాలి అని వైసీపీ భావిస్తూ ఉండవచ్చు. దీంతోనే మొదట్నుంచి ఆ పార్టీ మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు సైతం వాడే వేడి మాటలతో మధ్యలో బూతులతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కించారు. దీనిలో భాగంగా ఇటీవల విజయవాడకు వచ్చి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పొగిడిన పాపానికి ఏకంగా తమిళనాడులో ఎంతో క్రేజ్ ఉన్న రజనీకాంత్ మీద కూడా వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి మాటలను సైతం గట్టిగా తీసుకొని ఎదురుదాడికి పాల్పడుతున్నారు. అయితే మంగళవారం తమిళనాడులో జరిగిన ఒక ఫంక్షన్ లో వైసీపీ నేతలకు సమాధానం చెప్పేలా కుక్కలు మొరుగుతూ ఉంటాయి… అని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభుత్వమనేది సినిమా ఇండస్ట్రీ మీద పడకుండా ప్రజలకు మేలు చేసేలా ఉండాలి అని సూచించడం ద్వారా ఆయన కూడా వైసీపీ వ్యతిరేక మాటలు మాట్లాడినట్లే భావించాలి. దీంతో ఇప్పుడు పెద్ద హీరోలు, వారి మాటలు కూడా ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

తటస్థ ఓటర్లు ఎటు నిలబడతారు?

ఏ ఎన్నికల్లో అయినా ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేక ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది. అయితే తట్టస్తులైన వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. 2019లో తటస్థులైన ఓటర్లతోపాటు, వివిధ పక్షాలకు చెందిన ప్రత్యేక ఓటు బ్యాంకు సైతం జగన్కు కచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఓటు వేయడంతోనే 151 సీట్లు గెలవగలిగారు. అయితే జగన్ పరిపాలన పూర్తి అవుతున్న తరుణంలో తటస్థ ఓటర్లు జగన్ పాలనను ఏ విధంగా చూస్తారు అన్నది కీలకము. జగన్ పాలన మొదలు అయిన దగ్గర నుంచి విపక్ష పార్టీల మీద బూతులతో రెచ్చిపోతున్న మంత్రులు వారి ప్రజాప్రతినిధులు తీరును కచ్చితంగా తటస్థ ఓటర్లు గమనిస్తూనే ఉంటారు. తమ పార్టీని లేదా జగన్ ను ఏ మాత్రం మాట అన్న వారిని ఇష్టానుసారం మాట్లాడుతున్న ప్రజాప్రతినిధుల తీరు మీద మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. విమర్శలు ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండానే మంత్రులు స్థాయి వ్యక్తులు కూడా నీచాతి నీచమైన భాషను బహిరంగ సభల మీద మాట్లాడడం దానికి వంత పాడుతూ ముఖ్యమంత్రి జగన్ కూడా చిరునవ్వులు చిందించడం వంటి విషయాలు కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తటస్థ ఓటర్లను ఇవి ప్రభావితం చేస్తాయి అన్నది కాదనలేని మాట. వైసీపీ ప్రజా ప్రతినిధుల భాష మీద ఖచ్చితంగా చదువుకున్న వారిలో అభ్యంతరం ఉంది. అది ఎంత మేర ఉంది… ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతుంది అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. యువతలో స్పష్టంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంటే మహిళలు మాత్రం గుమ్మనంగా కనిపిస్తున్నారు. మహిళలు ఏ వర్గానికి ఈసారి వంద పాడితే కచ్చితంగా ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తటస్థ ఓటర్లు మేధావులు మాత్రం కచ్చితంగా వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తోంది. మొదటినుంచి జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులు మీద కక్ష సాధింపు చర్యలకు దిగడం, కేవలం కింది స్థాయి ఓటర్లు మాత్రమే నమ్ముకోవడంతో తటస్తులను మేధావులను అంత పట్టించుకున్న పరిస్థితి లేదు. అయితే వారి ఓట్లు మాత్రం ఎలా రాబడుతుంది అనేది వచ్చే ఎన్నికల్లోనే తేలుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *