fbpx

ఎన్నికల ముందు మళ్ళీ అగ్రి మంటలు!

Share the content

అగ్రిగోల్డ్ ఇష్యూ మరోసారి ఎన్నికల ముందు వైసిపి ప్రభుత్వన్ని ఇరకాటంలో పెట్టడానికి తెరమీదకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 వ తేదీన విజయవాడలో తలపెట్టిన ర్యాలీ, శంఖారావ దీక్ష ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను అటువైపు చూసేలా చేస్తుంది. ప్రతి ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ ఇష్యూ వస్తూనే ఉంది. భారీ ఆర్థిక మోసం కావడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగా బాధితులు ఉండడంతో వారికి న్యాయం చేయాలని కోరుతూ ప్రతిసారి వామపక్షాలు ఈ విషయాన్ని బయటకు తెస్తూనే ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయి న్యాయం చేస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే దానిని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయారు. దీంతో బాధితులు జగన్ చేసిన మోసాన్ని బయట పెట్టేందుకు భారీగా నిరసన కార్యక్రమానికి దిగనున్నారు. దీనివల్ల ఖచ్చితంగా వైసిపి ఇమేజ్ను డామేజ్ చేయడం, అలాగే అగ్రిగోల్డ్ బాధితులు అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలని బలంగా ప్రయత్నం జరుగుతోంది. వామపక్ష నాయకులు దీనికి అన్ని విధాల సన్నద్ధం చేస్తున్నారు.

** అగ్రిగోల్డ్ మోసం వల్ల 19.52 లక్షల మంది ఆర్థికంగా భారీ నష్టానికి గురయిన విషయం తెలిసిందే. అసోసియేషన్ నిరంతరంగా సాగించిన ఉద్యమాల కారణంగా గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలకు గురయిన 142 మందికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించబడినది. నేటి ప్రభుత్వ కాలంలో రూ.906 కోట్లు రూ. 20 వేల లోపు ఉన్నవారికి రెండు విడతలుగా కొంతమేరకు అందించడం జరిగినది. రూ.20 వేల లోపు మరో 3.50 లక్షల మందికి, రూ.20 వేల పైన 6.50 లక్షల మందికిపైగా డిపాజిట్లు రావలసిఉంది. రావలసిన అసలు మొత్తం రూ.3080 కోట్లు ఉంటుంది.

ఆరు మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని, వడ్డీతో సహా చెల్లింపులు చేయిస్తామని, కోర్టు విషయం తమ ప్రభుత్వం: చూసుకుంటుందని, కంపెనీ యాజమాన్యపు దుర్మార్గాల సంగతి నేను చూస్తానని, అసహజ మరణాలకు, ఆత్మహత్యలకు గురయిన వారికి తమ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా పూలలో పెట్టి పంపుతుందని జగన్ గత ఎన్నికల ముందు ఊరూరా ప్రకటించారు. బాధితులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఆవేదనతో డిపాజిట్ల కొరకు ఎదురుచూసి రోజులు గడుపుతున్నారు. దీంతో జగన్ ఇచ్చిన హామీ పూర్తిగా గాలిలో కలిసిపోయింది. దీంతో ఎన్నికల ముందు కచ్చితంగా దీనిని తెలియజెప్పాలి అనే లక్ష్యంతో అగ్రిగోల్డ్ మళ్ళీ తెర మీదకి రానుంది. సెప్టెంబర్ 15వ విజయవాడలో ప్రదర్శన, జింఖానా గ్రౌండ్స్లో సింహగర్జన సభ నిర్వహిస్తున్నారు. దీనికి దాదాపు అన్ని పార్టీల నుంచి కీలకమైన నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ముందు మరోసారి అగ్రిగోల్డ్ వ్యవహారం కాక రేపుతోందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *