fbpx

తెలంగాణలో తెలుగుదేశం ప్యాకప్!

Share the content

ఒకప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పని ఇక అయిపోయినట్లే అని అంతా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేది లేదని, చంద్రబాబు తేల్చి చెప్పడంతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలం పూర్తిగా కోల్పోయినట్లేనని పార్టీని అక్కడ మూసేసుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ శివారు ప్రాంతంలో అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుకున్న అంత మేర బలం ఉంది. అయితే పార్టీని నడిపించే నాయకులు క్రమంగా ఒక్కొక్కరు పార్టీకి దూరమవడంతో కేవలం కార్యకర్తలు మిగిలేరు తప్ప.. ఆ పార్టీకి నాయకులు లేరు. రాజీనామా చేసి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్న కాసాని జ్ఞానేశ్వర్ సైతం నిన్న మొన్నటి వరకు పార్టీకి దూరంగానే ఉన్నారు. ఎల్ రమణ పార్టీ అధ్యక్షుడు పదవి నుంచి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరిన తరువాత చాలా కాలం పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఖాళీగానే ఉండిపోయాయి. దీంతో చంద్రబాబు స్వయంగా పిలిచి బీసీ నేత ఆయన కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేశారు. తెలంగాణలోని బీసీలను కలుపుకొని పోవాలి అని కాన్సెప్ట్ లో భాగంగా కాసాని జ్ఞానేశ్వర్ ను పిలిచి మరి అధ్యక్షుడిగా చేశారు.

** అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు జైలులో ఉండడం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం… ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ముడిపడి ఉండడం వంటి విషయాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఈసారి పోటీ నుంచి తప్పుకోవడమే మంచిది అని భావించారు. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా చంద్రబాబు వైఖరి పట్ల గురుగా ఉండడంతో ఈసారి తెలంగాణలో ఎలాంటి స్టెప్పు తీసుకోకుండా మిన్నకుండిపోవడమే మంచిది అని బాబు భావించారు. ఆంధ్రప్రదేశ్లో తమతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో బిజెపితో జట్టు కట్టడం.. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మళ్లీ ఇరుపక్షాలకు తెలంగాణలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో పాటు బిజెపి పెద్దల ఆదేశాలను పట్టించుకోనట్లు అవుతుంది అనే కోణంలో చంద్రబాబు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. అన్ని విధాల ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకప్పుడు చాలా అవలీలగా తెలంగాణ లో సుమారుగా 70 నుంచి 80 సీట్లను సాధించిన తెలుగుదేశం పార్టీ ఇక అక్కడ నుంచి వెనక్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసిపి తెలంగాణలో పోటీ చేయకుండా ఎప్పటినుంచో నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *