fbpx

రాజమండ్రిలో పసుపు తుపాను

Share the content

రాజమహేంద్రవరం లో రాజకీయ అగ్గి రాజుకుంటోంది. మెల్లగా ఇది ఇక్కడ దహించుకుపోయే స్థాయికి వెళ్తుందా అన్నది అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో రాజమండ్రి సిటీ టిక్కెట్ కోసం విబేధాలు రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి. రాజమండ్రి టికెట్ నాదంటే నాది అన్నట్లుగా ఆదిరెడ్డి భవానీ అంటుంటే, ఈ సారి సిటీ నుంచే పోటీ చేస్తారనని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల భీష్మించుకుని కూర్చొన్నారు. దీంతో రాజమండ్రి లో తెదేపాలో ఏం జరగబోతోందన్నది అంతుపట్టడం లేదు.


బయటపడుతున్న లుకలుకలు
ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెదేపా తరఫున కొనసాగుతున్న ఆదిరెడ్డి భవానీకు మరోసారి టిక్కెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లేనని ఆ వర్గం ప్రచారం చేసుకుంటుంటే మరో పక్క రూరల్ నుంచి ఈ సారి బరిలోకి దిగేది లేదని కచ్చితంగా సిటీ నుంచే పోటీ చేస్తానని గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెబుతున్నారు. ఇప్పటికే ఆయన నుంచి అలాంటి సంకేతాలు బలంగా రావడంతో ఆదిరెడ్డి వర్గం నుంచి కోపాలు మొదలయ్యాయి. చంద్రబాబు టిక్కెట్ కేటాయించకుండా బుచ్చయ్య చౌదరి ఎలా చెప్పుకుంటారని ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నించడం సామాజిక మాధ్యమాల్లో తెదేపా వ్యవహారాలను బయటపెట్టింది. గోరంట్ల సీనియర్ నేత. గతంలో రాజమండ్రి సిటీ నుంచే పోటీ చేసిన ఆయనను 2014లో రూరల్ కు పంపారు. దీంతో మరోసారి ఆయన సిటీకు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో సిటీ అయితేనే బాగుంటుందని గోరంట్ల భావిస్తున్నట్లు సమాచారం.


జనసేన కోసమేనా?
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీలో ఉంటారని భావిస్తున్నారు. దీంతోపాటు ఆయన చేస్తున్న వరుస పర్యటనలు జనసేనకు బలం తెచ్చాయి. దీంతో ఈ సారి తెదేపాతో పొత్తు ఉన్నా లేకున్నా రాజమండ్రి నియోజకవర్గంలో జనసేన బలంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పొత్తులో వెళితే కచ్చితంగా ఆ సీటు జనసేనకు కేటాయించాలనే కోణంలో గోరంట్ల సిటీ వైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *