fbpx

టీడీపీ సెల్ఫ్ గోల్!

Share the content

టిడిపి నేతలు గన్నవరం యువగళం సభలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయి. సభకు వెళ్లిన ప్రతి ఒక్క నేత గొంతు చించుకొని మరి వైసిపి నేతలకు వార్నింగ్లు ఇవ్వడం వరకు తెలుగు తమ్ముళ్లకు బాగానే ఉంటుంది కానీ వారి వ్యాఖ్యలు వారి తీరు వారి ప్రసంగం చూసి మాత్రం సగటు ఓటర్లు అలాగే తటస్థ ఓటర్లు మాత్రం అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉండే దేవినేని ఉమా లాంటి వారు సైతం వైసీపీ నేతల మీద ఒక స్థాయిలో విమర్శలు బూతులు తిట్టడం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వైసీపీ కంటే దారుణమైన పరిస్థితులు తప్పవని తటస్థ ఓటర్లు భావించే అవకాశం కనిపిస్తుంది. కేవలం కక్షపూరిత రాజకీయాలు తప్ప తెలుగుదేశం పార్టీ వస్తే పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని సగటు ప్రజలు భావించే అవకాశాలు ఉన్నాయి. ఏ నేతను కదిపిన వైసీపీ నేతల దాస్టికాలపై వాస్తవ పరిస్థితులను మాట్లాడవచ్చు గాని టిడిపి నేతలు మాట్లాడిన తీరు మాత్రం పూర్తిగా గర్హనీయం.

ప్రస్తుత ప్రభుత్వం బాగోకపోతే వచ్చే ప్రభుత్వంలో మేలు జరుగుతుందని సగటు ఓటర్లు భావిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు గన్నవరం సభలో మాట్లాడిన తీరు దీనికి భిన్నంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వైసిపి నేతలు అందరిని కట్టగట్టుకుని అరెస్టులు చేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం అంటూ చెప్పడం ద్వారా సగటు ఓటర్లకు పెద్దగా ఆకట్టుకోలేని ప్రసంగంగా భయపెట్టే ప్రసంగంగా ఇవి మిగిలిపోనున్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే కేవలం కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది అన్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూరేలా తయారయ్యాయి. లోకేష్ దగ్గర నుంచి వేదికపై ఉన్న అందరూ ఇదే బాట పట్టి ప్రసంగాలు చేయడం విశేషం. గన్నవరం ఎమ్మెల్యే వంశీ తోపాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టార్గెట్గా నేతల ప్రసంగాలు హెచ్చరికలు సాగాయి. ఇది ఆయా నేతలకు ఏమాత్రం భయం కలిగించక పోగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే పెద్దగా అభివృద్ధి చేసే అవకాశం ఉండదని కక్షపూరితంగా ఒకరిని ఒకరి దూషించుకోవడం అరెస్టులు చేసుకోవడం పోలీసు కేసులు పెట్టుకోవడంతోనే సరిపోతుంది అని సగటు ఓటర్లు దీని ద్వారా భావించే అవకాశం ఉంది.

యువ గళం లాంటి పెద్ద పాదయాత్ర చేస్తున్న సమయంలో లోకేష్ ప్రసంగాలు పూర్తిగా చప్పగా సాగుతోంది. చేతిలో ఒక ఎర్ర డైరీ పట్టుకొని టిడిపి అధికారంలోకి వస్తే ఫలానా వ్యక్తిని గుర్తుపెట్టుకుంటామని ఫలానా వర్గాన్ని గుర్తుపెట్టుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేయడం ద్వారా పాదయాత్రలోని పూర్తి విషయం తేలిపోతుంది. వైసిపి చేస్తున్న పాలన లోపాలను అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటిని అధిగమిస్తామని సరికొత్త పాలన అందిస్తామని ప్రజలకు భరోసానిస్తే లోకేష్ పాదయాత్ర చాలా వరకు సక్సెస్ అయ్యేది. అలాకాకుండా కేవలం కక్షపూరితంగా తమ ప్రభుత్వం వస్తే వైసిపి వాళ్లని అందర్నీ అరెస్టు చేయిస్తామని చెప్పడం ద్వారా పాదయాత్రలో వచ్చే ప్రయోజనం కంటే, పాదయాత్ర ప్రతిఫలం పూర్తిగా పక్కకు పోయింది అని చెప్పొచ్చు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలను లోకేష్ కచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో ఆవేశపూరిత ద్వారానికి భిన్నంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఆలోచింప చేస్తున్నాయి. ఈ ప్రసంగాలను లోకేష్ పరిశీలించి ఉంటే ఆ పందాలు కనుక యువగళం యాత్రను ఆయన మార్చుకున్నట్లు అయితే చాలా ప్రతిఫలం దక్కేది. అలాకాకుండా కేవలం హెచ్చరికలు, బెదిరింపులతోనే ఆయన వైసీపీ వాళ్లను ఎదుర్కోగలం అని భావిస్తుంటే కచ్చితంగా అది సెల్ఫ్ గోల్ అయినట్లే భావించాలి. ఇదే తీరున యువగలం యాత్ర సాగితే మాత్రం లోకేష్ ఎంత దూరం నడిచిన పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *