fbpx

తెలంగాణలో టిడిపి పోటీ లేనట్లేనా??

Share the content

ఒకవైపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు అన్ని పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోయి ఉంటే ఒకప్పుడు తెలంగాణలో మంచి బలంతో ముందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోవడం విశేషం. తెలంగాణలో రాను రాను బలహీన పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ పనిచేస్తున్న క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో టిడిపి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద మాత్రం స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో బలమైన పట్టు ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో స్థిరపడిన సెటిలర్స్ అధికంగా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతారు. హైదరాబాద్ నగరంలోని సుమారు 6 నియోజకవర్గాల్లో అలాగే ఖమ్మంలో కూడా సుమారుగా ఐదు నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక తెలంగాణ ప్రాంతంలో అడపాదడపా ఓట్లు సాధించే సత్తా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుందా లేదా అనే దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.

తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పొత్తులు, మద్దతు సంగతి తర్వాత చూస్తామని ముందు తమకు ఎక్కడైతే కాస్త బలం ఉందో అక్కడ పోటీ చేసేందుకు సంసిద్ధం అవుతున్నామని జనసేన పార్టీ తెలిపింది. ఈ స్టెప్పు కూడా టిడిపి తీసుకోలేకపోతోంది. జనసేన పార్టీతో పోలిస్తే టిడిపి చాలా చోట్ల బలంగా ఉన్న పార్టీ. బలమైన ఓటు బ్యాంకు కొన్నిచోట్ల ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉండడంతో ఆ సానుభూతి కూడా కలిసి వస్తుంది. బలమైన నాయకత్వం లేకపోయినా కింది స్థాయిలో మాత్రం కాస్త ప్రభావితం చేయగల ఓట్లు సాధించగలదు. అయితే ఇవేవీ తెలుగుదేశం పార్టీ ఆలోచించడం లేదు. పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన దృష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు జైలులో ఉండడంతో కష్ట కాలంలో ఉంది. ఈ సమయంలో మొత్తం చంద్రబాబు బయటకు రావడం పై అలాగే వైసిపి ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి బయటపడడం పైనే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ సమయంలో మళ్లీ తెలంగాణ వైపు అడుగులు వేస్తే రాజకీయంగా మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుందని, ఈసారి కి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఉత్తమం అని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజెపి అధినాయకత్వం లోకేష్ తో ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో మద్దతు పలకాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు సెటిలర్స్ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టు పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాత్రమే చంద్రబాబు అరెస్టు పట్ల స్పందించలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కొనుక్కు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని నిర్ణయించుకుంటే ఆ పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుంది అనేది కూడా రాజకీయంగా కీలకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *