fbpx

అక్రమ అరెస్టులు,వేధింపులు కాదు…అంగన్వాడీ సమస్యలపై దృష్టి సారించండి

Share the content

రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు,వేధింపుల కోసం వెచ్చిస్తున్న సమయాన్ని.. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై వెచ్చించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనమని విమర్శించారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. నాడు అంగన్ వాడీల కష్టాన్ని, సేవను తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. 2014 నాటికి రూ. 4,200 వేతనం పొందుతున్న అంగన్వాడీలకు రూ. 6,300 పెంచి అనంతరం రూ.10,500 చేశామని వెల్లడించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు వారికి అందించామని పేర్కొన్నారు.

  • వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదని,చెల్లింపులు జరపడం లేదని ఎద్దేవా చేశారు. అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారన్నారు. దీనిపై నిరసనగా వారు చేపట్టిన సమ్మెను విచ్చిన్నం చేయడానికి పోలీసులు, వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానం నివ్వెరపరిచిందని తెలిపారు. న్యాయ బద్దమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం నిరంకుశత్వ తీరుకు నిదర్శనమన్నారు.
  • సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకు వెళ్లి ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్టు చేయడంపై పెట్టి శ్రద్ద…అంగన్ వాడీ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుందని ప్రశ్నించారు. ఆనారోగ్యంతో ఉన్న తల్లి కోసం స్వదేశానికి వస్తున్న ఎన్ఆర్ఐ యువకుడు యష్ బొద్దులూరి అరెస్టు కోసం పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపించి అరెస్టు చేశారని పేర్కొన్నారు. కానీ ఇంటి పక్కన నిరసనలు చేస్తున్న అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం సమయం వెచ్చించడం లేదని పేర్కొన్నారు.ఈ విధానాల ద్వారా జగన్ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *