fbpx

ఆంధ్రప్రదేశ్ ను ఆందోళనాంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్

Share the content

రాష్ట్రంలో గత 56 నెలల నుంచి విధ్వంసకర పాలన సాగిస్తూ.. అవినీతిపరులను, అసమర్థులను,నేరస్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు, విద్వేషాలు, వైఫల్యాలు తప్ప, భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడా ఒక మంచిపని కానీ, విజయం కానీ కనిపించవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భస్మాసురుడిలా జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే విధ్వంసం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ వర్గానికి రక్షణ లేదని, జనాభాలో సగ భాగమున్న మహిళలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి, ప్రజలకు రక్షణగా ఉండి వారి క్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రే, ఏపీ ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు.

దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయ తీలు, స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని,పంచాయతీల అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని జగన్ రెడ్డి, ఆఖరికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.9వేల కోట్లను దారిమళ్లించారని పేర్కొన్నారు. జగన్ నిర్వాకంతో గ్రామాల్లో ఎక్కడా మచ్చుకైనా కూడా అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. టిడిపి హాయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తప్ప, ఈ నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఎలాంటి మంచిపని జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న అనేక నిర్ణయాలు గతంలో దేశవ్యాప్తంగా అమలయ్యాయని… ప్రముఖుల ప్రశంశలు అందుకున్నాయిని వెల్లడించారు.2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ ను ఆందోళనాంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. 22 రోజులకు పైగా అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రిలో చలనం లేదని పేర్కొన్నారు. సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లు అందరూ జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని రోడ్లెక్కారని పేర్కొన్నారు. 100రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరిదశకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

బీసీ సమాజంపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తెలియచేస్తూ ‘జయహో బీసీ’

బీసీల గురించి సిఎం గొప్పగా మాట్లాడుతున్నారని, కానీ తన పాలనలో బీసీ లను దారుణంగా వంచించారని విమర్శించారు.వారిపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయించారని పేర్కొన్నారు. దుర్మార్గాలను ప్రశ్నించిన బీసీలను దారుణంగా చంపించారన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు 10శాతం కోత పెట్టారని,16వేలకు పైగా పదవుల్ని బీసీలకు దక్కకుండా చేశారని పేర్కొన్నారు. ఉత్తుత్తి కార్పొ రేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తున్నట్టు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. బీసీ మంత్రులను ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా తయారుచేశారని విమర్శించారు. బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను ప్రతి బీసీలకు అర్థమయ్యేలా తెలియచేయడానికి టీడీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని 4వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు అని వెల్లడించారు.

రా..కదలిరా” పిలుపుతో జనంలోకి టీడీపీ

ఈ నెల ఐదు నుంచి ప్రజా చైతన్యమే లక్ష్యంగా చంద్రబాబు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. అందులో ‘రా..కదలిరా’ కార్యక్రమం తో 5వ తేదీ నుంచి 29వ తేదీవరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని ప్రతిసభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

టీ.ఎన్.టీ.యూ.సీ బస్సు యాత్ర

టిడిపి కార్మిక విభాగ శాఖ అయిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీ.ఎన్.టీ.యూ.సీ) విభాగం త్వరలోనే బస్సుయాత్ర చేపట్టనుందని పేర్కొన్నారు. విభాగం నేతలు అన్నిరంగాల కార్మికులతో మాట్లాడి, టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలు..ఈ ప్రభుత్వంలో చేసిన మోసాల్ని వివరిస్తారు.” అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *