fbpx

ఈ నియోజకవర్గాల్లో వారసుల పోటీ!!

Share the content

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీనియర్లను కాదని వారి వారసులకు టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రోద్బలంతో యువతకు ఎక్కువ టికెట్లు కేటాయించాలి అన్న ప్రధానమైన కాన్సెప్ట్ తో నాయకుల వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు. కీలకమైన నియోజకవర్గాలతో పాటు, నాయకులు తమ వారసులను పరిచయం చేయాలి అనుకుంటున్న నియోజకవర్గాల్లో కచ్చితంగా వారి తరఫున వారి వారసులను రంగంలోకి దించేందుకు టిడిపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాతతరం కథ పూర్తయిందని నారా లోకేష్ కు తోడుగా యువ నాయకత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా రానున్న సంకేతాలు బలంగా తీసుకువెళ్లాలని టిడిపి భావిస్తోంది. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలి అని భావిస్తున్న నారా లోకేష్ తనకు అనుకూలమైన వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఇది మొదటి స్టెప్ గా భావించవచ్చు. భవిష్యత్తులో పార్టీ తరఫున ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన తన వర్గాన్ని తయారు చేయాలని భావిస్తున్నారు.

వీరికి గ్రీన్ సిగ్నల్

ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వరుసుగా గెలుచుకొని వస్తున్న సీనియర్ టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కొడుకు చింతకాయల విజయ్ ను ఈసారి రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు వేదికల మీద మాట్లాడిన విజయ్ ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ యూత్ విభాగానికి కూడా చింతకాయల విజయ్ ప్రధానంగా సేవలందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కొడుకును రంగంలోకి దించాలని భావిస్తుండడంతో ఇప్పటికే ఈ అంశాన్ని ఇటు చంద్రబాబుకు అటు లోకేష్ కు చెప్పారు. దీంతో టీడీపీ అధిష్టానం నుంచి విజయ్ పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక తుని నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేదా ఆయన తమ్ముడు కృష్ణుడు పోటీలో ఉంటారని ఇప్పటివరకు భావించారు. అయితే అంతర్గత సర్వేలో వీరిద్దరికీ సరైన పాజిటివ్ మార్కులు రాకపోవడంతో వీరి ఇంటి నుంచే మరో యువ నాయకురాలు యనమల దివ్య రంగంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో యనమల దివ్య ను అసెంబ్లీకి పంపాలని ఇప్పటికే యనమల కుటుంబం భావిస్తోంది. రామకృష్ణుడుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసనమండలి కీ తీసుకురావాలని ప్రతిపాదన కూడా ఉంది. దీంతోపాటు కృష్ణుడు క్షేత్రస్థాయిలో బలమైన నేత కాకపోవడంతో ఖచ్చితంగా యువ నాయకురాలు అయిన దివ్య కు టికెట్ కేటాయింపు దాదాపు ఖరారు అయినట్లే. ఇక వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన కుమారుడు జ్యోతుల నవీన్ కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే జ్యోతుల నవీన్ కు కాకినాడ ఎంపీ టికెట్ కావాలని టిడిపి అధిష్టానాన్ని అడిగిన అక్కడి నుంచి స్పందన రాలేదు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఈసారి కీలకమైన పారిశ్రామికవేత్త టిడిపి తరఫున రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో జ్యోతుల నవీన్ ను జగ్గంపేట నుంచి పోటీ చేయాలని లోకేష్ చెప్పారు. దీంతో జ్యోతుల నెహ్రూ మళ్ళీ మనసు మార్చుకొని జగ్గంపేట నుంచి తన కొడుకును రంగంలోకి దింపేందుకు సమయతమవుతున్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి కీలకమైన నేతగా నిన్న మొన్నటివరకు వైసీపీలో కొనసాగిన ఆనం రామ్ నారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి అనాసక్తి కనబరుస్తున్నారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ లోకేష్ మాత్రం సీనియర్లను ఎమ్మెల్సీలుగా చేసి శాసనమండలికి పంపి అసెంబ్లీకి మాత్రం వారి ఇంట్లోని యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. పామర్రు నుంచి వర్ల రామయ్య స్థానం లో వర్ల కుమార్ రాజా బరిలోకి నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆనం రామనారాయణ రెడ్డి కి కూడా లోకేష్ చేరవేసినట్లు సమాచారం. కైవల్యా రెడ్డి ని ఒప్పించి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడేలా చూడాలని ఇప్పటికే రామ్ నారాయణ రెడ్డికి చంద్రబాబు కూడా చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద ఈసారి నాయకుల వారసుల మొహాలు టిడిపిలో అధికంగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద నారా లోకేష్ తన ప్రధానమైన టీం ను తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు, వచ్చే ఎన్నికలను దానికి వేదికగా చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *