fbpx

తూర్పులో జనసేన బలమెంత..?

Share the content

జనసేన పార్టీకి కంచుకోట లాంటి తూర్పుగోదావరి జిల్లాలో అసలు ఆ పార్టీ బలం ఎంత..? పూర్తిస్థాయిలో ఎన్నికలకు వెళ్లి గెలవగలిగే నేతలు ఎందరు..? అందరికీ పవన్ కళ్యాణ్ చరిష్మా నే అవసరమా.. లేక సొంతంగా ఎన్నికలు చేసుకొని గెలవగలిగే దమ్ము ఉన్న నాయకులు జనసేన పార్టీలో ఉన్నారా అంటే ఇప్పుడు చాలామంది అవును అనే సమాధానం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్నమాట వాస్తవమే కానీ పూర్తిస్థాయిలో అనుభవం ఉన్న నేతలు మాత్రం ఆ పార్టీలో లేరు అన్నది నిజం. ఒకరు ఇద్దరు మినహా పూర్తిస్థాయిలో నేతలంతా రాజకీయాలకు అలాగే ఎన్నికలకు కొత్త వారే కావడం ప్రధాన సమస్య. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని బలాలను ఉపయోగించి గెలవాలని చూస్తున్న అధికార వైసీపీకి, నాయకుల లోపమే వరం కానుంది.

ఎక్కడ బలం.. ఎక్కడ బలహీనత

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరంగా చూస్తే 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేన పార్టీ ఏ నియోజకవర్గానికి ఇప్పటివరకు టికెట్లు ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల నాయకుల బలాబలాలను పరిశీలిస్తే రాజమండ్రి నగర అసెంబ్లీ సీటుకు సంబంధించి సత్తి సూర్యనారాయణ పూర్తిగా అనుభవ లేమి ఉంది. ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం లేని స్పష్టంగా కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నియోజకవర్గం నాయకులుగా ఉన్నారు. గతంలో రాజకీయ అనుభవం ఉన్న కందుల దుర్గేష్ ఈసారి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో తన బలాన్ని పూర్తిగా పెంచుకున్నారు. ఈసారి అక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమనే వార్తలు అప్పుడే షికారు చేస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో బండారు శీను బాబు ప్రతి గ్రామంలో తిరుగుతున్నప్పటికీ ఎన్నికల ను అంతే బలంగా చేయగలరా అన్నది ప్రశ్న. ఇక్కడి ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డిని ఢీకొట్టాలి అంటే అన్ని రకాలుగాను సంసిద్ధులు కావాలి. రాజోలు నియోజకవర్గానికి ఇప్పటివరకు జనసేన పార్టీ ఇన్చార్జి ఎవరూ లేరు. గతంలో రాజోలు నియోజకవర్గం గెలిచిన జనసేన రాపాక వరప్రసాద్ వేరే పార్టీకి మారడంతో జన సైనికులు ఆయన మీద కోపంగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసిపి తరఫున ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ఇటీవల జనసేనలో చేరారు. ఇక్కడ ఎవరికి టికెట్ దక్కిన జనసైనికులు కసి మీద పనిచేస్తారు అన్న పేరు ఉంది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. శేషు కుమార్ కి ఈసారి కూడా టికెట్ ఇస్తారా లేక వేరే ఎవరికైనా ఇస్తారా లేదా పవన్ కళ్యాణ్ స్వయంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు గణనీయమైన స్థాయిలో ఉంటారు. వారంతా కచ్చితంగా జనసేన పండుగ నిలబడతారని భావిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గం లో శెట్టిబత్తుల రాజబాబు బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లోను ఆయనకు 40 వేల ఓట్లకు పైగా వచ్చాయి. అయితే అమలాపురం నియోజకవర్గం లో జనసేన లో గ్రూపులు ఉండడం ఇప్పుడు అక్కడ మింగుడు పడని అంశంగా తయారయింది. ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ ఈసారి బరిలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో పార్టీ తరఫున పట్టుపించుకోవడం దగ్గర నుంచి ఈసారి కచ్చితంగా సానుభూతి ఆయనకు పనికొస్తుందని అంచనా. కాకినాడ నగరం నియోజకవర్గం నుంచి మొత్తం శశిధర్ ఉన్నారు. పార్టీలో బలమైన నేతగా పేరు ఉన్నప్పటికీ ఎన్నికలను ఎలా చేయగలరు అన్నది ప్రశ్న. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ముమ్మరంగా తిరుగుతున్న పంతం నానాజీ అనుభవమైన రాజకీయ నాయకుడు. కొన్ని ఎన్నికలను దగ్గరుండి చేసిన వ్యక్తి. దీంతో ఈసారి ఆయన గెలుపు ఖాయంగా ఉంటుందని భావిస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ బలంగా ఉన్నప్పటికీ పటిష్టమైన నాయకత్వం లేదు. ఇక్కడ బలమైన నాయకులు వస్తే కచ్చితంగా ఈ సీటు గెలిచే అవకాశం కనిపిస్తోంది. పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో తుమ్మల బాబు తిరుగుతున్నప్పటికీ ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు లభించడం లేదు. మండపేట నియోజకవర్గం పరిధిలో వేగుళ్ల లీలా కృష్ణ జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. టిడిపి నుంచి ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రశ్న. ఈ నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు కు వైసీపీ టికెట్ ఇస్తే ఇక్కడ సమీకరణాలు మారే అవకాశం ఉంది. రామచంద్రపురం విషయంలో జనసేనకు పటిష్టమైన నాయకత్వం లేదు. రాజానగరం విషయానికి వస్తే బత్తుల బలరామకృష్ణ జనసేన తరఫున బలంగా పోరాడుతున్నారు. ఆయనకు ఎన్నికలు చేసుకోవడం రాదు. అనుభవం కూడా చాలా తక్కువ కావడం మైనస్. అనపర్తి నియోజకవర్గంలోనూ జనసేనకు నాయకత్వలేని స్పష్టంగా కనిపిస్తోంది. తుని నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ బలంగా ఉన్నప్పటికీ నడిపించే నాయకత్వం లేమి కనిపిస్తోంది. సుమారుగా 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ బలంగా ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *