fbpx

అనిల్ అంతం.. సొంత పార్టీ నేతల పంతం

Share the content

ఒకప్పుడు నెల్లూరు నగరం నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినెట్ లోనే కీలకమైన జలవనరుల శాఖ నిర్వర్తించిన అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. రాజకీయంగా ఆయనకు అన్ని వైపుల నుంచి సొంత పార్టీలోనే ఎదురుదెబ్బలు, ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. సీనియర్లు జిల్లాకు చెందిన వైసిపి అధిష్టానం పెద్దలతో అంత సఖ్యతగా ఉండరని పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ కు జగన్కు సన్నిహితులుగా పేరు ఉంది. అన్ని వర్గాల నుంచి విముఖత ఎదురవుతుంది. కేవలం ముఖ్యమంత్రి వైయస్ జగన్ భక్తుడిగా మిగిలిపోతానని పదేపదే ప్రకటిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎప్పటికీ పక్కలో బల్లెం లా తయారయ్యారు.

తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీకి ఆర్థిక దన్నుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ తీరు మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్న జగన్ దానికి సంబంధించిన నిర్ణయం కోసం ఆర్థిక వనరుల సమీకరణ కోసం వేమిరెడ్డి తో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నుంచి అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థి అయితే తనకు కొత్త తలనొప్పులు వస్తాయని వేమిరెడ్డి జగన్ ముందే చెప్పినట్లు సమాచారం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే తనకు ఇబ్బందులు ఉన్నాయని వేమిరెడ్డి చెప్పడంతో జగన్ సైతం అనిల్ తీరు మీద అయోమయంలో పడ్డారు. అనిల్ కుమార్ యాదవ్ తీరి మీద ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అనిల్ ప్రాముఖ్యతను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన జగన్ ఇంకా ఫిర్యాదులు ఆగకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చకు కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ తీరు మీద బహిరంగంగా యుద్ధం ప్రకటించడమే కాకుండా ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో జగన్ కోసం ప్రత్యేక కార్యాలయం కూడా ప్రారంభించారు. అంతేకాకుండా బహిరంగంగా అనిల్ కుమార్ యాదవ్ మీద వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించడం నెల్లూరులో కాక పుట్టించింది. దీంతోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారడం మరోవైపు అండగా నిలబడతాడు అనుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అనిల్ కుమార్ యాదవ్ తీరు మీద సానుకూలంగా లేకపోవడంతో పాటు ఇప్పుడు ఏకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సాఫ్ట్ కార్నర్ ఉన్న నేత సైతం అనిల్ కుమార్ యాదవ్ మీద ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అన్న కొత్త చర్చకు తెర తీసినట్లు అవుతోంది. నెల్లూరు జిల్లా మీద పూర్తి ఫోకస్ పెట్టిన వైయస్ జగన్ కచ్చితంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పుపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు తర్వాత కచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొదటి నుంచి అనిల్ కుమార్ తీరు మీద నెల్లూరు జిల్లా నాయకులు అందరిలోనూ సరైన భావన లేదు. పార్టీలో ఎవరిని కలుపుకుపోరని మంత్రిగా ఉన్న సమయంలో ఏకచత్రాధిపత్యం సాగించారని ఇప్పటికి చెబుతుంటారు. ప్రతి దానికి వైయస్ జగన్ పేరును ఉపయోగించుకోవడం తప్ప పార్టీలో ఇతర నేతలను సీనియర్లను గౌరవించుకునే కనీస బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ కు లేదని ఇప్పటికే బహిరంగంగా కొందరు నేతలు చెప్పగా మరికొందరు నేతలు అవకాశం వచ్చిన సమయంలో కీలకమైన సమయంలో ఆయన మీద ఫిర్యాదు చేయడం మొత్తంగా అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం మీదే ఇప్పుడు దెబ్బ పడే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *