fbpx

షర్మిల భవితవ్యం గందరగోళం.

Share the content

ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి కాంగ్రెస్ వేసిన వ్యూహం ఫెయిల్ అయినట్లే అని తెలుస్తోంది. వైయస్ షర్మిల అడిగిన రాజ్యసభకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఆమె తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమెతోపాటు ఆమె తల్లిని కూడా పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నారు. వీరిద్దరితోపాటు షర్మిల భర్త అనిల్ కుమార్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల వెళ్తారని అంతా భావించారు. దీనికి సంబంధించి చర్చల కోసం కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సారథ్యంలో షర్మిల చర్చలు కూడా జరిపారు. అనంతరం రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ పెద్దలను కలిశారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో షర్మిల తనకు రాజ్యసభ కావాలని.. దీంతోపాటు మరికొన్ని వరాలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాలని తర్వాత రాజ్యసభ గురించి మాట్లాడదామని చెప్పడంతోనే షర్మిల పూర్తిగా వెనక్కు వచ్చేసారు. పార్టీని సైతం విలీనం చేసే ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు షర్మిల రాజకీయ భవితవ్యం ఏమిటి అనే విషయం సందిగ్ధం కొనసాగుతోంది.

** వైయస్ఆర్టిపి మొదలుపెట్టి పాదయాత్ర కూడా చేసిన షర్మిల తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ముందుగానే ప్రకటించారు. దీంతోపాటు షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారని పలుమార్లు తెలిపారు. తెలంగాణ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షర్మిల ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడ్డారు. చాలా నియోజకవర్గాల్లో షర్మిల పార్టీ అంటే తెలియని వారు అధికంగా కనిపిస్తున్నారు. కేవలం హైదరాబాద్ ఖమ్మం ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థులను నిలబెట్టడం కూడా కష్టంగానే ఉండడంతో… తల్లి విజయమును భర్త అనిల్ కుమార్ ను కూడా ఎన్నికల రంగంలోకి దింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. కొడుకు కష్ట కాలంలో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విజయమ్మ ఇప్పుడు కూతురు కష్ట కాలంలోనూ ఆమెకు వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంది. సికింద్రాబాద్ స్థానం నుంచి విజయమును పోటీకి దింపాలని షర్మిల భావిస్తున్నారు. సెటిలర్స్ ఓట్లు కచ్చితంగా పడతాయని దీంతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అధికంగా ఉండడంతో ఆస్థానాన్ని షర్మిల వ్యూహాత్మకంగా తల్లి కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు చిక్కు ఏమిటంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్ టిపి తరఫున పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ముందుకు రావడం లేదు. కనీసం తెలిసిన మొహాలను అయినా ఎన్నికల్లో నిలపాలని షర్మిల భావిస్తుంటే… వారు సైతం భారీ భారీ ప్యాకేజీలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. చిన్న స్థాయి వ్యక్తులు కూడా కోట్లలో డిమాండ్ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇస్తారు అసలు పోటీలో ఎలా ముందుకు వెళ్తారు అనే కీలకమైన అంశం షర్మిల ముందు ఉంది. ఆమె ఈ వైకుంఠపాళీ లో నిచ్చిన ఎక్కుతారా లేక పెద్ద పాముకాటుకు గురై కిందకు వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *