fbpx

విద్యార్థుల బంగారు భవిష్యత్ కు టోఫెల్ తరగతులు : ప్రవీణ్ ప్రకాష్

Share the content

ప్రపంచ స్థాయి పౌరులుగా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ తరగతులను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని డీఈవోలు, ఆర్జేడీలను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఈటీఎస్, ప్రిన్స్‌టన్ యుఎస్‌ఎ మరియు ఎస్‌సిఈఆర్‌టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మధ్య జరిగే సంయుక్త మూల్యాంకన (రెడీనెస్ సర్టిఫికేషన్) అంశాలను వివరిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సారిగా ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్(ETS) ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ (యుఎస్‌ఎ) మరియు ఒక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విద్యార్థుల ప్రధాన పరీక్షకు సన్నద్ధతను (స్టూడెంట్స్ ప్రిపేర్డ్ నెస్) అంచనా వేస్తుండటం గమనార్హమని తెలిపారు.

ఈ సందర్భంగా 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రోజువారీ టోఫెల్ తరగతులను నిర్వహించడం, ఆ విద్యార్థులకు వినే, మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని డీఈవోలకు సూచించారు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 10 (బుధవారం) న, 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 (శుక్రవారం)న మూల్యాంకనం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే ఎస్ సీఈఆర్ టీ ఆడియో విజువల్ కంటెంట్ ను అందించిందని, తద్వారా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆ కంటెంట్ తోడ్పడుతుందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవసరమైన ఆడియో విజువల్ మెటీరియల్ ను ఎస్ సీఈఆర్ టీ అందిస్తుందని తెలిపారు.

ఇటీవలి కాలంలో తాను జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కొన్ని పాఠశాలల్లో రోజూవారి టోఫెల్ తరగతులు నిర్వహించడం లేదన్న అంశాన్ని గమనించానని తెలిపారు. సదరు పాఠశాలల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశానన్నారు. ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో తప్పనిసరిగా టోఫెల్ తరగతులు నిర్వహించేలా డీఈవోలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశమని తెలిపారు. పాఠశాలల్లో టోఫెల్ తరగతులు సక్రమంగా నిర్వహించేలా డీఈవోలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. అవసరమైతే భాగస్వామ్యుల (స్టేక్ హోల్డర్స్) నుండి అభిప్రాయాలు సేకరించాలన్నారు. టోఫెల్ తరగతులు నిర్వహించడంలో విఫలమైతే డీఈవోలే జవాబుదారీగా వ్యవహరించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *