fbpx

సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

Share the content

రాష్ట్ర ప్రభుత్వంతో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె మూడవ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర సందర్భంగా జగనమోహన్ రెడ్డి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, నాలుగు నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని కోరారు. పీఎఫ్, ఈ.ఎస్.ఐ అమలుచేయాలని నినాదాలు చేశారు.

మానవహారం సందర్భంగా పోలీసులు నిరోధించే ప్రయత్నం చేయగా పోలీసులు, ఉద్యోగులుకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజ్ కుమార్ జోక్యం చేసుకొని శాంతియుతంగా సమ్మె పోరాటాన్ని నిర్వహిస్తున్న ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవద్దని పోలీసులకు హితవు పలికారు. తక్షణం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలను, అఖిలపక్ష కార్మిక సంఘాలను కలిపి సమ్మె ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, యూటీఫ్ నగర నాయకులు రమణ, ధర్మరాజు, మహేష్, రవి శ్రీనివాస్, ఎం.ఈ.ఓ సంఘం నాయకులు పి.కృష్ణవేణి, ఎన్.గణేష్ బాబు, కె.వెంకటేశ్వరరావు, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ నాయకులు ఎం.చంటిబాబు, ఏ.లోవరాజు, నారాయణ, గంగాధర్, నాగమణి, సుబ్రమణ్యం, తారక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *