fbpx

కేంద్ర నిధులు మళ్లింపు వలనే సమగ్ర శిక్షలో సంక్షోభం

Share the content

పంజాబ్, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం.చంటిబాబు,సత్య నాగమని ,సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డీఈవో కార్యాలయం వద్ద 8 రోజులుగా సమ్మెచేస్తున్న ఉద్యోగులుకు మద్దతు తెలిపి జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లాకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి మినిమం టైం స్కెల్ ప్రకారం వేతనాలను చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వశిక్ష అభియాన్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా గత పదేళ్లనుండి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే సర్వశిక్ష అభియాన్ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలల నుండి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు.2014 ముందు పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో 2005 నుండి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు లేరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్షలో పనిచేసే 25 వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో సమ్మె పోరాటాన్ని ఉధృతం చేయడం మినహా మరొక మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మా పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరుని మా విద్యార్థులు కూడా గమనిస్తున్నారని, మా సమస్యలు పరిష్కరించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. తక్షణం సర్వశిక్షా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *