fbpx

పవన్ ఓ సంపూర్ణ రాజకీయ నాయకుడు.

Share the content

ఒకప్పుడు ఆవేశపరుడు అన్నారు… కనీస సామాజిక అవగాహన లేదన్నారు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. రాజకీయాలు ఏం తెలుసని పార్టీ పెట్టాడు అన్నారు.. అన్న కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతే తమ్ముడు ఇంకో పార్టీలో బేరం పెట్టుకోవడం కోసం పార్టీ పెట్టాడు అన్నవారు ఉన్నారు… సొంత పార్టీ పెట్టి ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే వారిని ఏమంటారు అంటూ నవ్వారు.. పార్టీ పెట్టాడే గాని దానికి ఇప్పటివరకు సంస్థగత కార్యవర్గమే లేదు అని విశ్లేషించిన వారు ఉన్నారు.. కేవలం సినిమా గ్లామర్ తో పార్టీ నడిచి పోతుందా అని ప్రశ్నించిన వారు ఉన్నారు.. కనీసం ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన వాడు పార్టీ ఇంకేం నడుపుతారు అని చెప్పిన వారు ఉన్నారు.. ఎన్నో హేళనలు మరెన్నో అవమానాలు ఇంకెన్నో చిత్కారాలు.. లెక్కకు మించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాగించిన రాజకీయ ప్రయాణం ఇప్పుడిప్పుడే రాజకీయ విశ్లేషకులకు, నిపుణులకు అర్థమవుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వైఖరి మీద బహిరంగంగా విమర్శలు చేసిన వారే ఇప్పుడు ఆయన వేసే రాజకీయ అడుగులను నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేయబోయే ప్రకటనలు, ఆయన నోటి నుంచి వచ్చే దాటైన విమర్శలు ఎలా ఇతర పార్టీలకు తగులుతాయా అని వేచి చూస్తున్నారు. 2014లో జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయంగా బాగా ఆరితేరారు. రాజకీయ ఎత్తులు పార్టీ బలోపేతం మీద ఆయన పెట్టిన దృష్టి, మొదటినుంచి ఒక విజన్ తో వెళ్తున్న ఆయన రాజకీయ వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాలకు స్పష్టంగా కనిపిస్తోంది.

కేవలం తూతూ మంత్రపు రాజకీయం కోసం కాదు

పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో పదేపదే ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయనకు అర్ధమైనంతగా ఇతరులకు అర్థం కాలేదు. కేవలం సినిమా గ్లామర్ ను నమ్ముకుంటే ఓట్లు రావు అన్నది పవన్ కళ్యాణ్ మనసులోని మాట. అది 1985 దశంలో నడిచింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సినిమా గ్లామర్ రాజ్యాధికారాన్ని, బలమైన పార్టీని నిర్మించలేదు అని పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు. అందుకే ఆయన సినిమా గ్లామర్ ని మాత్రమే నమ్ముకోలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ విషయం ఆయనకు ఇంకా బాగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేయాలంటే మొదట పార్టీ కచ్చితంగా అధికారం దిశగా అడుగులు వేయాలని భావించారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆర్థిక వనరులు పార్టీలోని నాయకుల పరిస్థితి మీద పూర్తి అంచనా ఉండడంతో కచ్చితంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో తన దగ్గర ఉన్న బలంతో అధికారం సాధ్యం కాదు అని అంచనాకు వచ్చారు. దీంతోనే ఆయన వచ్చిన వారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకోలేదు. మొదటినుంచి తన కోసం నిలబడ్డ వారికి ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తగా తనకు అనుకూలమైన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా నడక మొదలుపెట్టారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అయింది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ పార్టీకి బలమైన నాయకత్వం తీసుకొచ్చారు. ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామో మొదటి నుంచి గమనించి ఆ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించి పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ దగ్గర పూర్తిస్థాయి రిపోర్టు ఉంది.

ప్రజారాజ్యం పాఠాలు నేర్చుకొని..

పార్టీలోకి వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకుంటూ పవన్ కళ్యాణ్ పోలేదు. తన రాజకీయ ప్రయాణం మొదలైన దగ్గర నుంచి కీలకంగా భావించిన నేతలను ఆయన ప్రోత్సహించారు. ఎవరైనా పార్టీలో చేరుదామని వస్తే కచ్చితంగా టికెట్ మీద వారికి భరోసా ఇవ్వలేదు. మొదట పార్టీ కోసం కష్టపడాలని జనసైనికులతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేయాలని వారికి చెబుతూ వచ్చారు. ఇది చాలామంది కీలక నేతలకు నచ్చలేదు. పార్టీలోకి వద్దామని చివరి వరకు అనుకొని డ్రాప్ అయిన నేతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ టికెట్ల మీద ఖచ్చితమైన ఎస్యురెన్స్ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో పార్టీలోకి రాకుండా ఉండిపోయిన వారు ఉన్నారు. ప్రజారాజ్యం సమయంలో కేవలం ఎన్నికల కోసం వచ్చిన వారు తర్వాత పార్టీని ఎలా నాశనం చేశారో దగ్గర్నుంచి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా మరోసారి తప్పు చేయకూడదని బలంగా భావించారు. దీంతోనే వచ్చిన నేతలను మొదటగా నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు. దీంతో జనసేన పార్టీలోకి భారీ చేరికలు లేకుండా సాధారణంగానే ఉండిపోయాయి. రాజకీయ నేతలు తన రాజకీయ ప్రయాణాన్ని ఎందుకు తీసుకువెళ్లేందుకు జనసేన ఉపయోగపడుతుందని భావించారు. అయితే పవన్ వైఖరి మాత్రం దీనికి భిన్నంగా సాగింది. ఉన్న కొద్దిమంది అయినా బలమైన నేతలు తన సిద్ధాంతాలకు కట్టుబడిన నేతలు మాత్రమే ఆయన పార్టీలో కొనసాగించారు.

బీజేపీతో దోస్తీ కే మొగ్గు

2019 ఎన్నికల అనంతరం వెంటనే ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను కలిసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని బిజెపితోనే కొనసాగించాలని బలంగా భావించారు. ఇప్పటం సభలోను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనెవ్వను అని చెప్పిన ఆయన బిజెపిని మాత్రం పక్కన పెట్టే ప్రసక్తి లేదని టిడిపి వంటి పెద్ద పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిది పంపారు. దీంతోపాటు బిజెపి పెద్దలను సైతం పొత్తుకు ఒప్పిస్తూ వైసిపి వ్యతిరేక ఓటు చేయకుండా చూడాలని ఆయన కోరుతున్నారు. పదే పదే పొత్తులు మార్చుతారని పేరును ఆయన చెరిపేసుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా బిజెపి అగ్రనాయకత్వంతో పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ వంటి వారు సైతం పవన్ ను చక్కగా రిసీవ్ చేసుకుంటారు. దీంతోపాటు రాష్ట్రంలో వైకాపాకు చెక్ పెట్టాలంటే ఢిల్లీలోని బిజెపి కేంద్ర పెద్దలు సహాయం కూడా అవసరం. దీంతో ఆయన రెండువైపులా పదునున్న కత్తితో రాజకీయ ఆట మొదలుపెట్టారు. టిడిపి తో సహా కలిసి వెళ్తే బలమైన నియోజకవర్గాల్లో ఖచ్చితమైన సీట్లు అడగాలని జనసేన పార్టీ అధినేత భావిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం ఉంది. దీని ద్వారా రాబోయే రోజుల్లో పార్టీకి మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇటు అధికారంతోపాటు పార్టీ సంస్థాగతంగా చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా పరిపూర్ణుడు.. ఆయన ఆలోచనలు వేసి అడుగులు కూడా పూర్తిస్థాయి రాజకీయపరంగానే ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తులు 100% విజయం సాధించినట్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *