fbpx

పవన్ కళ్యాణ్ కు తత్వం బోధపడింది..

Share the content

రాజకీయాల్లో రియలైజేషన్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే గాలిలో మేడలు కడతారు. మన బలం ఎంతో తెలుసుకొని దాన్ని మరింత పెంచుకునే దిశగానే రాజకీయాలు ఉండాలి. అధిక అంచనాలు పెంచుకుంటే రాజకీయాల్లో పనికిరాదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ అధిక అంచనాలను పూర్తిగా పక్కన పెట్టి, అసలైన లెక్కలు బలాబలాలను బెరీజు వేసే స్థాయికి వచ్చారు. జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉంది..? అక్కడున్న పరిస్థితులు ఏమిటి అన్న క్షేత్రస్థాయి అంచనాలకు జనసేనాని వచ్చినట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఉభయగోదావరి జిల్లాలను ఆయన తన రాజకీయ రణక్షేత్రానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల్లో కూడా అడపాదడపా పోటీ చేయవచ్చు గాని ముఖ్యంగా గోదావరి జిల్లాలోనే ఈసారి సత్తా నిరూపించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోంది.

స్పష్టంగా చెబుతున్నారు

ఉభయగోదావరి జిల్లాలో మొత్తం మీద 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలు ఏ పార్టీకి నిలబడితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ఎప్పటినుంచో నమ్మకం ఉంది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలపై తన ప్రధాన దృష్టి అని ప్రతి సభలోను చెబుతున్నారు. వారాహి యాత్రను ఒక ప్రణాళిక ప్రకారమే ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలుపెట్టినట్లు అర్థమవుతుంది. దీంతోపాటు బహిరంగ సభల్లోనూ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇక్కడి నుంచి రాజకీయ చరిత్ర మొదలు పెడతామని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులో వెళితే గోదావరి జిల్లాలోని అధికమైన సీట్లు అడిగే అవకాశం కనిపిస్తోంది. కచ్చితంగా తన బలం ఉన్నచోటనే పొత్తు ద్వారా అయినా సింగిల్ గా అయినా సత్తా చాటి రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయి పట్టు పెరిగితే ఇతర ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరింప చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అధికంగా గోదావరి జిల్లాల నుంచే సీట్లు అడిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక సంకేతం గా కూడా భావించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *