fbpx

పవన్ కళ్యాణ్ కొత్త స్టాండ్

Share the content

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన వాళ్లని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు అనే పేరు ఉండేది. అయితే తాజాగా గతంలో పెందుర్తి నుంచి పిఆర్పి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ మళ్లీ జనసేనలోకి రాకతో కచ్చితంగా పవన్ ఒక రాజకీయ సిగ్నల్ ను పంపినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను చాలా కీలకంగా తీసుకుంటున్న జనసేనాని పటిష్టమైన అభ్యర్థుల వేటలో ఇప్పుడు బిజీగా కనిపిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో పిఆర్పి లో పనిచేసిన బలమైన నాయకులను సైతం చేర్చుకునేందుకు తాజాగా పవన్ కళ్యాణ్ సంసిద్ధం అయినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం ఎన్నికల కోసమే రాజకీయాలు చేసే వారిని దగ్గరకు కూడా రానివ్వను అని చెప్పిన జనసేన అధినేత ఇప్పుడు తన స్టాండ్ ను మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో వచ్చే కాలంలో మరికొన్ని చేరికలు జనసేనలోకి భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాత మిత్రులు చర్చలకు రెడీ

గతంలో పిఆర్పి లో పనిచేసే కాంగ్రెస్ విలీనం తర్వాత వివిధ పార్టీలోకి వెళ్లిపోయిన నేతలు ఇప్పుడు మళ్లీ జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే జనసేనలోకి రావాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి సరైన సంకేతాలు అందలేదు. అయితే తాజాగా పంచకర్ల రమేష్ వంటి నేతలు జనసేనలోకి వస్తుండడంతో పాత మిత్రులు కూడా మళ్లీ జనసేనలోకి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లిన జనసేన పార్టీని ఇదే తీరున నడిపించే క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కచ్చితంగా రాజకీయ పాత మిత్రులను ఆహ్వానిస్తున్నారు. వారి సేవలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలు ఉండాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. టిడిపి తో పొత్తు ఉన్న లేకున్నా బలంగా పోటీ ఇవ్వాలి అనేది ఆయన అభిప్రాయం. దీనికి తగినట్లుగానే ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నచోట మార్పులు చేర్పులు చేయడం, పిఆర్పి లో గతంలో పనిచేసిన నేతలను సైతం దగ్గరకు చేర్చుకోవడం, పోలీస్ కేసులు అధికంగా ఉన్న నాయకులను సైతం అంగరంగ వైభవంగా పార్టీలో చేర్చుకోవడం వంటివి పవన్ కళ్యాణ్ చేయడం ద్వారా కచ్చితంగా పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా జనసేన పార్టీలోకి భారీ చేరికలు ఉండాలని పవన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి తో జనసేన మాత్రమే బిగ్ ఫైట్ అయ్యేలా చూడటంలో భాగంగా మరికొన్ని చేరికలకు జనసేన అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టిడిపి తో పొత్తు విషయం తేలితే చాలామంది నేతలు జనసేనకు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *