fbpx

ప్రజల ఆశయాలకు విరుద్ధంగా వైకాపా పాలన : పల్లంరాజు

Share the content

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని.. అంతా అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపులే ఈ ప్రభుత్వంలో ఉన్నాయని ఎఐసిసి సభ్యుడు, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు విమర్శించారు. బుధవారం కాకినాడలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసిపి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించి విశ్వాసం పోగొట్టుకుందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా రంజక పాలన కాకుండా కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతుందని మండిపడ్డారు. బీజేపీ, వైకాపాలను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కడితే దేశ ప్రజలును సుఖ సంతోషాలతో ..దేశాన్ని ఆర్థిక రంగంలో ముందు భాగంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

దేశంలో వివిధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచన్యాయాలతో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐదు రకాల వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు పాంచ న్యాయ్ అనే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే పథకాల గురించి వివరించారు. సమాన, నారీ, రైతు, యువ, శ్రామిక న్యాయం వంటి ఐదు గ్యారంటీలను వివరించారు.ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనున్న నీరుకొండ సత్యనారాయణ, మాదేపల్లి సత్యానందరావు, గేలం శ్రీనివాసరావు, చెక్క నూకాజీ బాబు, మారోతి శివ గణేష్, తుమ్మల దొరబాబు పిల్లి సత్యలక్ష్మిలను పల్లంరాజు పరిచయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *