fbpx

ప్యాకేజీ స్టార్ × తెలుగుదేశం పార్టీ = రాజకీయం

Share the content

పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్.. తెలుగుదేశం పార్టీ ఏది ఆడమంటే అది ఆడతాడు. మా దగ్గర డబ్బు ఉంటే ప్యాకేజీ ఇచ్చేవాళ్లం.. చంద్రబాబు దత్తపుత్రుడు.. చంద్రబాబు ఆడినట్లు ఆయన ప్యాకేజీ తీసుకొని పర్యటనలకు వస్తాడు… ఇలా బోలెడు ఆరోపణలు ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులు పదేపదే చేస్తూ ఉంటారు. దీనిని బహిరంగ వేదికల మీద కూడా జనసేన అధినేత ఖండించారు. పార్టీకి ఉన్న ఆర్థిక లెక్కలన్నీ మీడియా ముఖంగానూ వినిపించారు. ఇంకోసారి ప్యాకేజి స్టార్ అని ఎవడైనా అంటే చెప్పు తీసుకొని కొడతాను అని కూడా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా ఆ విమర్శలు మాత్రం వైసీపీ నాయకులు ఆపడం లేదు. అయితే ఈ విమర్శలకు ఆరోపణలకు బదులు చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు మాత్రం దీని మీద నోరు మెదపరు. మేము ఎలాంటి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పరు.. అదే చంద్రబాబు నాయుడు రాజకీయం. ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు కొలిక్కిరాని తరుణంలో చంద్రబాబు అర్జెంటుగా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కాదని బహిరంగంగా చెప్పే సాహసం చేయరు. ఒకవేళ పొత్తులో ఏవైనా తేడాలు వచ్చి ఎవరిదారు వారు చూసుకుంటే ఇదే ఆరోపణను తెలుగుదేశం పార్టీ కూడా మరింత బలపరిచే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే అడ్వాన్స్డ్గా తెలుగుదేశం పార్టీ ప్యాకేజి స్టార్ అన్న వ్యాఖ్యల మీద ఏ మాట మాట్లాడదు. తమకు వ్యతిరేకంగా ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే వెంటనే విరుచుకుపడే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కూడా ప్యాకేజి స్టార్ విమర్శలు మీద ఏమాత్రం స్పందించకపోవడమే తెలుగుదేశం పార్టీ రాజనీతి. వైసీపీకి ఉన్న ప్రధానమైన ప్యాకేజి స్టార్ అనే విమర్శనూ కొనసాగించడమే టిడిపి నేతల అసలు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా బదనాం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేది కూడా టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకపోతే ప్యాకేజీ స్టార్ అనే మాటను టిడిపి నేతలే బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నట్లు అర్థం అవుతుంది.

గతంలోనూ పరిటాల రవి గుండు కొట్టించారని..

గతంలోనూ పవన్ కళ్యాణ్ మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు అనంతపురం టిడిపి నేత పరిటాల రవి గుండు కొట్టించారు అన్నది ప్రధానమైన ఆరోపణ. దీని మీద కొందరు సినిమాలు తీసే వరకు వెళ్లారు. ఒక బలమైన వర్గం దీనిని విస్తృతంగా ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ పలుమార్లు దీనిపై స్పందించిన దానిని మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు పరిటాల రవి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ కనీసం మా ఇంట్లోకీ కూడా రాలేదని, ఆయనను మా కుటుంబమంతా గౌరవంగా చూస్తుందని చెప్పడంతో చాలా వరకు విమర్శలు తగ్గాయి. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిటాల రవి కుటుంబాన్ని కలిసి వారితో మాట్లాడడంతో చాలా వరకు మీడియాలో కథనాలు తగ్గాయి. లేకుంటే అప్పట్లో పరిటాల రవి గుండు కొట్టించి పవన్ కళ్యాణ్ కింద కూర్చోబెట్టారు అన్న ప్రచారం విస్తృతంగా సాగిన వేళ దానిని ఖండించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్లీ ప్యాకేజి స్టార్ అనే మాటను ఖండించడానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే ముందుకు రావాలి. తెలుగుదేశం పార్టీ తరఫునుంచి లేదా చంద్రబాబు నాయుడు దగ్గరనుంచి ఎలాంటి డబ్బులు పవన్ కళ్యాణ్ తీసుకోవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే చెప్పాలి. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా సాక్షాధారాలు చూపించాలి. అయితే ఇలాంటి పనులు చేయడానికి టీడీపీ సిద్ధంగా లేదు. పవన్ కళ్యాణ్ కు ఎంత డార్క్ ఇమేజ్ వస్తే టిడిపికి అంత ప్రయోజనం అని భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి టిడిపి దగ్గర చేయి చాపాడు అని ప్రజలు అనుకోవాలి అని టిడిపి నే భావిస్తోంది. నారా లోకేష్ నాయకుడిగా ప్రమోట్ అవుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను చిన్నది చేసే ఏ చర్యను టిడిపి వదులుకోదు. టిడిపి అనేది పూర్తిస్థాయి రాజకీయ పార్టీ. ఆ పార్టీకి తన మన భేదాలు ఉండవు రాజకీయం అధికారం అనేవి చివరి లక్ష్యాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *