fbpx

వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ లో కాకినాడ జమధాని చీర,అరకు కాఫీ లకు బంగారు పతకాలు

Share the content

భారత ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ గుర్తింపులో ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను రుజువు చేసుకుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) ముఖ్య కార్యదర్శి సునీత తెలిపారు. బుధవారం డిల్లీ వేదికగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అయా జిల్లాల కలెక్టర్లు ఈ గుర్తింపును అందుకున్నారు. వినూత్న రంగాలలో అగ్రగామిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్‌ నుండి టెక్స్‌టైల్స్, హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాల నుండి 26 దరఖాస్తులను సమర్పించగా, 14 ఉత్పత్తులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయన్నారు. వాటిలో 6 అవార్డులు మన రాష్టానికే దక్కగా, రెండు జిల్లాలకు బంగారు పతకాలు లభించాయని సునీత తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 538 జిల్లాల నుండి దరఖాస్తులు రాగా, వాటిలో 64 ఉత్పత్తులను షార్ట్ లిస్ట్ చేసారు. చివరకు దేశంలోని అన్ని జిల్లాలకు కలిపి 10 అవార్డులు రాగా వాటిలో ఆరు ఆంధ్రప్రదేశ్ నుండే ఉండటం గర్వకారణమన్నారు.దేశంలోని అన్ని జిల్లాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో, ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్రృత ప్రచారం కల్పించటం ఈ కార్యక్రమ ముఖ్య ఉధ్దేశ్యమన్నారు.

కాకినాడ జిల్లా ఉప్పాడ జమధాని చీరలు, అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు కాఫీకి బంగారు పతకాలు దక్కగా, శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరలు, కర్నూలు జిల్లా కోడుమూరు గద్వాల చీరలకు కాంస్యం లభించాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక ప్రస్తావన లభించింది. అవార్డు గ్రహీతల జాబితాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఆర్థిక వృద్ధి, సుస్థిరతను పెంపొందించడంలో ఈ జిల్లాలు, ఉత్పత్తులు ప్రదర్శించిన అంకితభావం, ఆవిష్కరణలను ఈ కార్యక్రమం వెలుగులోకి తీసుకువచ్చింది.

ఐదు చేనేత ఉత్పత్తులకు ఓడిఓపి అవార్డులు రావటం చేనేతకు ఆదరణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని సునీత పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, నేతన్న నేస్తం పథకం కింద 81,783 చేనేత కుటుంబాలకు రూ.24వేల సాయంతో రూ.969.77 కోట్ల లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. ఎన్ హెచ్డి సి ద్వారా నేత కార్మికులకు రాయితీతో కూడిన నూలు సౌకర్యం, ఆప్కో ద్వారా చేనేత వస్ర్తాల మార్కెటింగ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా బట్టల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేత నేత సహకార సంఘాలకు నగదు క్రెడిట్‌ సౌకర్యాన్ని తీసుకువచ్చామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *