fbpx

పిఠాపురంపై ముద్రగడ వ్యూహం

Share the content

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లడం ఖాయమేనా..? అంటే అదో వ్యూహంగా వైసీపీకి ఎన్నికల ముంగిట్లో పనికొస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాపుల్లో ఓ రకమైన ఉద్వేగం కలిగించిన సమయంలోనే, ముద్రగడ పార్టీలోకి వస్తే బాగుంటుందనే వైసీపీ అగ్రనేతల ఆలోచన. ఏమి లేకుండా ముద్రగడ వైసీపీలోకి వచ్చినా, అది వైసీపీకి ఏ మాత్రం ప్రయోజనం చూపదని భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లలో చీలిక తేవాలంటే కచ్చితంగా ముద్రగడ పద్మనాభం పాచిక అస్త్రం పనికొస్తుందని వైసీపీ నమ్ముతోంది.

గిరిబాబుకు టిక్కెట్ ఇస్తారా..?

ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే తనకు కాకుండా తన కుమారుడు గిరిబాబుకు టిక్కెట్ కేటాయించాలనే అడిగే అవకాశం ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే పిఠాపురం నుంచి గిరిబాబుకు టిక్కెట్ కోరవచ్చు. అయితే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో భారీ పోటీ ఉండే అవకాశం ఉండటంతో స్పష్టత కోసం వైసీపీ ఎదురు చూస్తోంది. ముద్రగడ సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆలోచనలకు పదును పెడుతోంది. అయితే గిరిబాబు రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని ముద్రగడ బలంగా భావిస్తున్నారని, దీనిపై వైసీపీ నుంచి స్పష్టత రాకపోవడంతోనే పార్టీలోకి వెళ్లకుండా ఆగారు అన్నది సన్నిహితుల మాట.

రైలు దగ్ధం కేసులో ఊరట

తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో కచ్చితంగా నిందితులకు శిక్షలు పడతాయని అంతా భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసులను ఎత్తివేసినా, రైల్వే చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి తగిన విధంగా నిందితులకు శిక్షలు ఉంటాయని అనుకున్నారు. అయితే ఈ కేసును కోర్టు ఇటీవల కొట్టివేయడంతో ముద్రగడతో పాటు మంత్రి దాడిశెట్టి రాజా కూడా బయటపడినట్లు అయింది. దీంతో తుని కేసు ప్రభావం ఏమీ ఉండదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయడం, రైల్వే కోర్టు కేసును కొట్టివేయడం వంటి విషయాలు వైసీపీకి అనుకూలంగా మారుతాయని, వైసీపీ చేసిన ఈ విషయాలను ముద్రగడ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూడా ఎన్నికల వ్యూహం రచిస్తున్నారు.

పిఠాపురం ఎందుకంటే..?

చివరి సారిగా ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ తరపు నుంచి 2009లో పిఠాపురం నుంచే పోటీ చేశారు. అప్పట్లో వంగా గీత చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతోపాటు కాపు సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ 80 వేల వరకు ఉంటాయి. దీంతో ఇక్కడ కాపుల్లో ఎన్నికల నాటికి బలమైన సెంటిమెంటును రగిలించగలిగితే కచ్చితంగా ముద్రగడకు ఇక్కడి ఓటర్లు జై కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని నేతలను ముద్రగడ తరుచూ కలుస్తున్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులను అడిగి వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ అధిష్ఠానం నుంచి బలమైన సంకేతాలు అందిన వెంటనే ముద్రగడ వైసీపీ కండువా వేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *