fbpx

విశాఖలో మరిన్ని మార్పులు!!

Share the content

విశాఖపట్నంలో అధికార వైఎస్ఆర్సిపి చేస్తున్న మార్పులు చేర్పులు ఇప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. విశాఖ ఎంపీగా 2019లో గెలిచిన ఎంవివి సత్యనారాయణ ను విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించడం తాజా పరిణామం. గత ఎన్నికల్లో త్రికోణ పోటీలో నెగ్గుకు వచ్చిన సత్యనారాయణ తర్వాత కాలంలో ఎంపీగా కేవలం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే విశాఖపట్నం సమస్యల మీద ఏనాడు పార్లమెంటులో కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎం వి వి నీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలబడితే దాదాపు విజయం కష్టమేనన్న అంచనాకు వచ్చిన వైసీపీ అధిష్టానం ఆయనకు తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే ఎంవివి లాంటి వ్యక్తులను వదులుకునేందుకు వైసీపీ సిద్ధంగా లేదు. దీంతో ముందుగానే ఎం వివికి పంపిన సమాచారం మేరకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవాలని వైసీపీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఎంవివి విశాఖ తూర్పు అయితే తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావించి వైయస్ జగన్ వద్ద ప్రతిపాదన పెట్టారు. ఎక్కడ వరుసగా మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి కి దీటుగా అదే సామాజిక వర్గానికి చెందిన ఎం వివి సత్యనారాయణ అయితే అన్ని విధాల బలంగా ఎదుర్కోగలరు అని వైసిపి అధిష్టానం బలంగా నమ్మి ఎంవివి కి బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గంలో పై వైసీపీలోనే ముగ్గురు నేతలు పోటీపడినప్పటికీ వారిని కాదని ఎంవివిని ఎంపిక చేయడం వెనుక భారీగా సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల నుంచి గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు మొదటి అడుగుగా దీనిని భావించవచ్చు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తులను రంగంలోకి దింపేందుకు వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా కూడా కొత్త వ్యక్తి రంగంలోకి దిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాఖ ఎంపీ సీటు మీద చాలా ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ విషయంలో వైసీపీ పెద్దలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు కలిసి వస్తే ఆ పారిశ్రామిక వ్యక్తిని విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలిపే అవకాశం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో విశాఖలో అన్ని సీట్లను గెలవాలి అన్నదే లక్ష్యంగా పూర్తిగా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను రంగంలోకి దింపేందుకు జగన్ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. వచ్చే ఎన్నికల్లో సాగర తీరాన కచ్చితంగా ఎన్నికల కోలాహలం బాలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *