fbpx

మోడీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్

Share the content

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త బందును జయప్రదం చేయాలని కార్మిక సంఘం లు పిలుపునిచ్చాయి.కచేరిపేట సిఐటియు కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన జరిగిన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశంలో కాకినాడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు మాట్లాడుతూ…రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేసి, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని తెలిపారు. నిత్యావసరాల ధరలను తగ్గించాలని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని పేర్కొన్నారు.కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, గుర్తింపు కార్డులు, పంట నష్టం అందించాలని కోరారు. ఉపాధిహామీ పథకాన్ని 200 రోజులకు విస్తరించి, రోజు వేతనం 600 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని రక్షించండి ..దేశాన్ని కాపాడండి నినాదంతో ఈ దేశవ్యాప్త బంద్ జరుగుతుందని వివరించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల సమయంలో పేదరికం 30% పెరిగిందని, కరోనా కంటే ముందే దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని విమర్శించారు. పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని నిరుద్యోగం 40ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ప్రజల సంపదతో నిర్మించుకున్న సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించడమే లక్షంగా మోడీ విధానాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఈ బందులో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 8వ తారీఖున కాకినాడలో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని, 9 10 తేదీలలో పరిశ్రమలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, వ్యాపార సంస్థలకు బంద్ నోటీసులు అందించాలని, 13, 14 తేదీలలో ఆటో ప్రచారం నిర్వహించాలని, 16వతేదిన జిల్లా మొత్తం బంద్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కార్యాచరణ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఐ.ఎఫ్.టి.యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అంజిబాబు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, కాకినాడ రూరల్ నాయకులు రాజా, మెడిశెట్టి వెంకట రమణ, ఎఐసిసిటియు జిల్లా నాయకులు నరసరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *