fbpx

నగదు పంచడమే మహిళా సాధికారతనా ? : ఎమ్మెల్సీ ఐ.వి

Share the content

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగసభ గురువారం కచేరిపేట సుందరయ్య భవనంవద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి అధ్యక్షతన జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెక్క రమణి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గాదేవి హాజరై మాట్లాడుతూ…భారతదేశంలో మతోన్మాదం మహిళల హక్కులకు ప్రధాన శత్రువని.. పురుషాధిక్యతకు వ్యతిరేకంగా మహిళలు నిరంతర పోరాటం నిర్వహించడం ద్వారా మాత్రమే సమాన హక్కులు సాధించుకోగలమని అన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాట వరసకు మాత్రమే మహిళా సాధికారత అనే పదాన్ని వాడతారని, డబ్బులు పంచడమే మహిళా సాధికారతా అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో పురుషుల కంటే తక్కువ వేతనాలు మహిళలకు చెల్లిస్తున్నారని, ఆక్వా, జీడిపిక్కల పరిశ్రమలలో మహిళలకు కనీస చట్టాలైన పిఎఫ్, ఈఎస్ఐ రక్షణ పరికరాలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు పరిపాలనలో కూడా సగభాగం కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం పేరుతో అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, యానిమేటర్లను ప్రభుత్వాలే దోపిడీ చేస్తుంటే సమాన హక్కుల కోసం పోరాడటం మినహా మరొక దారి లేదన్నారు. అంగన్వాడి సమ్మెలో రాష్ట్ర మహిళలపై పోలీసుల ద్వారా అకృత్యాలకు జగన్ ప్రభుత్వానికి ఉన్న హక్కేమిటని, కనీస వేతనాలు అడిగే హక్కు అంగన్వాడీలకు లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, నగర కార్యదర్శి భారతి, రెడ్డి సత్యవతి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి, అంగన్వాడి సంఘం జిల్లా కోశాధికారి రమణమ్మ, నగర కార్యదర్శి జ్యోతి, చామంతి, నాగమణి, దాడి బేబి, రాజేశ్వరి, ఎస్తేరురాణి, వీరవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *