fbpx

సీఎం భక్తి చాటుకుంటున్న రాపాక..

Share the content

జనసేన పార్టీ తరపున గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరొకసారి స్వామి భక్తి చాటుకున్నారు. తన కుమారుడి వివాహ శుభలేఖలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతుల ఫోటోని ముద్రించారు. ఈ విషయంపై పలువురు వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ జన సైనికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో తాను దొంగ ఓట్లతో గెలిచానని మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి మించిన తరహాలో రాపాక చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా జన సైనికులు మరొకసారి రాపాక వరప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. రాజోలు నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలవడంతో జన సైనికుల అభినందనలు అందుకున్నారు. తాను వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనే ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రాణం పోయే వరకు జనసేనలోనే ఉంటాను అన్న రాపాక వరప్రసాద్ కొన్ని రోజులకే వైసిపి మద్దతుదారుడుగా మారిపోయారు. అప్పటినుండి ఆగ్రహంలో ఉన్న జనసైనికులు రాపాక చేసిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానం చాటుకున్న రాపాక..

సమయం దొరికినప్పుడల్లా సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. జూన్ 7వ తేదీ రాపాక వరప్రసాద్ కుమారుడు పెళ్లి జరగనుంది. పెళ్లి శుభలేఖ పైన సీఎం వైయస్ జగన్, భారతీ దంపతుల ఫోటోను శుభలేఖ పైన ముద్రించారు. మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతమ్మ గార్ల ఆశీస్సులతో పెళ్లి అంటూ పెళ్లి పత్రిక ముద్రించారు. వారి ఆశీస్సులతో వివాహం జరుగుతుందంటూ రాపాక మరొక సారి అభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు. ఈ విషయంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరొకసారి రాజోలు సీటు కోసమే రాపాక సీఎం జగన్ను పొగుడుతున్నారంటూ మరికొందరు అంటున్నారు.

సీటు కోసం ఇంత దిగజారాలా..

తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ మద్దతుగా మారడం జనసైనికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఏకంగా వైసిపి ఎమ్మెల్యేలతో సమానంగా గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించారు. సమయం దొరికినప్పుడల్లా సీఎం భజన చేస్తున్నారు. పెళ్లి శుభలేఖ పై దేవుడి ఫోటోలు వేసే స్థానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతుల ఫోటో వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ సీటు కోసం మరీ ఇంత దిగజారిపోయాడంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *