fbpx

శాసించే స్థాయి నుంచి దేహి అనే స్థాయికి వామపక్షాలు

Share the content

పాపం వామపక్షాలకి రాష్ట్రంలో ఎంత కష్టం వచ్చింది.. ఒకప్పుడు అలిగి గొడవ పెట్టుకుని మరి సీట్లు సాధించిన వామపక్ష నాయకులు ఇప్పుడు కనీసం ఎవరితో జట్టు కట్టాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. ఒకప్పుడు పొత్తు పెట్టుకుంటే ప్రధాన పక్షాన్ని గట్టిగా నిలదీసి మరి సీట్లు సాధించుకున్న వామపక్ష నాయకులు ఇప్పుడు కనీసం తమకి ఒకటో రెండో ఇస్తే అదే మహదానందం అనేలా తయారయ్యారు. దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారిపోతున్న వామపక్ష నాయకులు తీరే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో ఏ పక్షంతో జట్టు కట్టాలి అన్నదానిమీద వామపక్ష నాయకులు చేస్తున్న విభిన్నమైన స్టేట్మెంట్లు పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న తీరు ఆ పార్టీల పరిస్థితిని పూర్తిగా బయటపెడుతోంది. సిపిఎం సిపిఐ రెండు కలిసి ఏకతాటిపైకి వచ్చినప్పటికీ వారితో జట్టు కట్టేందుకు ప్రధాన పక్షాలు ఏవి సిద్ధంగా లేవు. ఒకప్పుడు సాలిడ్ ఓటు బ్యాంకుతో వామపక్షాల ప్రభావం చాలా నియోజకవర్గాల్లో బలంగా ఉండేది.

ముఖ్యంగా కార్మిక కర్షక పక్షాలు, కూలీలు పేదలు ఉండే చోట వామపక్ష నేతల ప్రభావం కచ్చితంగా కనిపించేది. అయితే రాను రాను వామపక్షాల తీరు కేవలం చందాలు దందాలు అనే రీతిలో ఉండడంతోనే వామపక్షాల పరిస్థితి ఇప్పుడు రాను రాను తీసికట్టుగా తయారైంది. వామపక్ష సిద్ధాంతాలు భావజాలం ఉండిపోయింది తప్ప వాటిని పాటించే నాయకులు మాత్రం ఇప్పుడు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వామపక్షాలు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుతున్న కాలానికి తగిన రాజకీయాన్ని చేయడంలో వెనుకబడి పోయాయి. ఫలితంగా ఒకప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో సుమారుగా 5000 నుంచి 15 వేల మధ్యలో ఉండే వామపక్షాల ఓటు బ్యాంకు చెల్లా చెదురు అయింది. ఇప్పుడు అత్యంత బలంగా ఉన్నచోట్ల కూడా కనీసం 500 ఓట్లను సాధించడం వామపక్షాలకు కష్టమే అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టేందుకు తహతహలాడుతున్న వామపక్షాలు ఇప్పుడు ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేసే పనిలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా బిజెపితో వెళ్లడం సరికాదు అంటూ కొత్త పల్లవిని ఆ పార్టీల రాష్ట్ర నాయకులు పదేపదే చెబుతున్నారు. బిజెపితో వెల్తే సిద్ధాంత పరంగా వైరుధ్యాలు వస్తాయని భావించి కచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీలు వాపక్షాలతో కలిసి వెళితే జగన్ ను ఎదుర్కోవడం సులభం అవుతుందని కొత్త రాగం అందుకున్నారు. అలాకాకుండా బిజెపితో కనుక వెళితే కచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని కాబట్టి ఖచ్చితంగా వామపక్షాలను కలుపుకు వెళ్లాలని దేహి అని అడుక్కునే పరిస్థితిలోకి వామపక్ష నాయకులు వెళ్లిపోయారు. ఎన్నో కొన్ని సీట్లు లేదా పవన్ పొత్తులోకి తీసుకుంటే చాలు అన్నచందంలో వారు మాట్లాడుతున్న తీరు అత్యంత దినమైన పరిస్థితిని తెలియజేస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉద్యమాలు చేసిన వామపక్షాలు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా శోచనియమే. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కచ్చితంగా ఆ పార్టీల నాయకులు అనుసరిస్తున్న వైఖరి అలాగే కేవలం పార్టీలను అడ్డుపెట్టుకొని సంపాదిస్తున్న తీరు పేద ప్రజల్లో వారికి తగ్గిన ఆదరణ ఇలా అనేకమైన అంశాలు దీనిలో ముడిపడి ఉంటాయి. దీనికి తోడు రాష్ట్రస్థాయి నాయకులు సైతం ఒక దశ దిశ లేకుండా చేసిన రాజకీయాలు కూడా వామపక్షాలు సర్వనాశనం కావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *