fbpx

గుంటూరు కారం చిత్రంలో ఆ సన్నివేశాలను తొలగించాలి : ప్రజా సంఘాలు

Share the content

గుంటూరు కారం సినిమాలో విలన్ పాత్రలకు మహనీయుల అయిన మార్క్స్, లెనిన్ పేర్లను పెట్టి అవమానపరిచిన చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం విజయవాడలో లెనిన్ సెంటర్ వద్ద చిత్రంలో అభ్యంతరాలపై నిరసన కార్యక్రమం జరిగింది. నేటి సమాజంలో మంచి ప్రత్యామ్నాయ విధానాలను సందేశాత్మకంగా అంశాలు అందించాల్సిన త్రివిక్రమ్.. ప్రపంచ మహానీయులైన కారల్ మార్క్స్ , లెనిన్ పేర్లు విలన్ పాత్రలకు పెట్టి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమాలో అసభ్యకరంగా ఉన్న కుర్చీ మడత పెట్టి బూతు పాటని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. విలన్లకు లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర పటాలు దహనం చేసి నిరసన తెలిపారు.త్రివిక్రమ్ కి మతి భ్రమించిందని, ప్రపంచ కమ్యూనిస్టు అగ్రనేతల పేర్లను ఈ సినిమాలో విలన్ పాత్రలకు పెట్టి సమాజానికి తప్పుడు సంకేతాలివ్వడం సరికాదన్నారు.

కారల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన మహానేత అని, ‘దాస్ కాపిటల్’ రచించి ప్రపంచవ్యాప్తంగా శ్రామికవర్గాన్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. లెనిన్ మార్క్సిజంతో రష్యాలో విప్లవాన్ని విజయవంతం చేశారని గుర్తు చేశారు. దోపిడీ, పీడన, అణచివేత లేని సోషలిస్టు సమాజాన్ని ఏర్పరిచిన ఈ మహనీయుల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు. త్రివిక్రమ్, మహేష్ బాబు చేసిన ఈ ఘోర తప్పిదానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చిత్ర ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల ఉద్యమ నాయకులు వి వెంకటేశ్వర్లు , దడాల సుబ్బారావు , బి శ్రీదేవి , ఎ అశోక్ , అండ్ర మాల్యాద్రి , ఎస్ అనిల్ , జి రామన్న, గుండు నారాయణ, ఎస్ లెనిన్ , జి సుబ్బారెడ్డి , ప్రసన్న, సోమేశ్వర్రావు , చింతల శ్రీనివాస్ , జి ఝాన్సీ , రాణి , కళ్యాణ్ , నర్సింహారావు , గాదె ఆదిలక్ష్మి, ఎవి వెంకటేశ్వరరావు , హనీఫ్, రాఘవేంద్ర, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *