fbpx

కొల్లేరు ఓటర్లు ఎటువైపు…?

Share the content

ఏలూరు జిల్లా పరిధిలో ఈసారి కొల్లేరు రాజకీయం ఎటువైపు ఉంటుంది అన్నది ప్రధాన ప్రశ్నగా మారుతుంది. ఏలూరు జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొల్లేరు ఓటర్లు కనిపిస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్థాయిలో కొల్లేరు ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ వైపు మొగిన కొల్లేరు ఓటర్లు 2024 ఎన్నికల్లో ఎవరు వైపు ఉంటారు అన్నది ఇప్పుడు ఏలూరు జిల్లాలో కీలకం కానుంది.

భీమడోలు.. దెందులూరు.. కైకలూరుకు కీలకం

కొల్లేరు ప్రాంత ఓటర్లు ఏలూరు జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల్లో కనిపిస్తారు. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ వైసీపీ తన సత్తా చాటింది. కొల్లేరు ప్రాంత ఓటర్లు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలపై ప్రభావితం చూపుతారు. కొల్లేరు ప్రాంతంలోని సుమారు 26 పంచాయితీల్లో అత్యధికంగా వైసీపీ ప్రజాప్రతినిధులే పాలనలో ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఉన్నంత ఐక్యత మాత్రం ప్రస్తుతం నాయకుల్లో కనిపించడం లేదు. ఇది వైసీపీకి ఈసారి ఎదురుగాలి వీస్తుందా అన్న అనుమానాన్ని కలగజేస్తోంది.

కొల్లేరుకు ఎం చేశారు?

2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు కాంటూరు సమస్య ఏమాత్రం తీరలేదు. మూడవ కాంటూరుకు కుధిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీ పూర్తిస్థాయిలో నెరవేరలేదు. మరోపక్క కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో ఆ కొల్లేరు రెగ్యులేటర్లకు కూడా టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కొల్లేరులో రెగ్యులేటర్లు నిర్మిస్తే నీరు ఎప్పటికప్పుడు ఉప్పుటేరులో కలిసిపోకుండా కొల్లేరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికోసం వైసీపీ ప్రభుత్వం రూ.450 కోట్లు విడుదల చేస్తున్నట్లు దీనికి టెండర్లు పిలిచింది. అయితే రెగ్యులేటర్ల నిర్మాణానికి టెండర్లు మాత్రం రాలేదు. అంత తక్కువ నిధులతో రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తికాదు అన్నది కాంట్రాక్టర్ల అంచనా. దీంతో కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం కథ కంచికి చేరింది. దీంతో కాంటూరు సమస్యగా తీర్చలేక మరోపక్క రెగ్యులేటర్లు నిర్మించలేక వైసీపీ ప్రభుత్వం కొల్లేరు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితికి వెళ్ళింది.

వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు

వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ప్రాంతంలో అక్రమ చెరువులు తవ్విన వారికి తవ్వినంత అన్న స్థాయిలో జరిగాయి. నియోజకవర్గ నాయకులు తమ అనుచరులకు ద్వితీయ శ్రేణి నాయకులకు చెరువులను కట్టబెట్టారు. ప్రతి ఎకరానికి చెరువు తవ్వు కునేందుకు కొంత మొత్తం కమిషన్లుగా తీసుకున్నారు. ఇది కొల్లేరులో జగమెరిగిన సత్యం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరులో సుమారు 40 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు వెలిసినట్లు సమాచారం. జాతీయ హరిత ట్రిబ్యునల్ కు అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొల్లేరులో జరిగిన అక్రమ చెరువులు పై కొల్లేరు ధ్వంసం పై ఇచ్చిన నివేదిక తర్వాత ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడం వెనుక కొల్లేరు నాయకుల హస్తం ఉంది అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పటికి జరుగుతున్న చర్చ. కొల్లేరు ధ్వంసం పూర్తిగా వైసిపి పాలనలోని అయింది అన్నది అక్కడి నాయకులు చెబుతున్న మాట. కొల్లేరుకు ఏమి చేయక కొల్లేరు వశం చేసిన వైసీపీకు ఈసారి కొల్లేరు ఓటర్లు అండగా నిలుస్తారా లేదా అన్నది అసలైన ప్రశ్న. కొల్లేరు లో వడ్డీ కులస్తులు ఎక్కువ. వీరు బీసీ బీలోకి వస్తారు. వీరంతా 2019లో ఏకపక్షంగా వైసీపీకి ఓటు వేశారు. ఈసారి మీరు ఏ పక్షం నిలబడతారు అన్నది రాజకీయ వర్గాలు ఇప్పట్లో అంచనా వేయలేకపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *