fbpx

కొబ్బరి రైతుపై కంటి తుడుపు చర్యగా మద్దతు ధర

Share the content

క్వింటాల్ కొబ్బరికి కనీస మద్దతు ధర రూ.15 వేలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్,రాష్ట్ర కో కన్వీనర్ బత్తిని లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 సీజన్ కు సంబంధించి కొబ్బరి కనీస ధర పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. 2023 లో మద్దతు ధర మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్ కు రూ.10,860 కాగా 2024 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.300 మద్దతు ధర పెంచగా రూ.11,160 గాను, బంతి కొబ్బరి క్వింటాల్ కు రూ.11,750 కాగా 2024 సంవత్సరానికి రూ.250 పెంచి రూ.12 వేలుగా నిర్ణయించిన ఈ ధర ఏమాత్రం రైతులకు గిట్టుబాటు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర కల్పించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొబ్బరి పంట ఉన్న జిల్లాలలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలనే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కొబ్బరి కనీస మద్దతు ధర పెంచకపోతే రైతులు ఐక్యంగా ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొబ్బరి మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని ఎద్దేవా చేశారు.మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా కొబ్బరి రైతుల గోడును కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. కొబ్బరి రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రం ప్రభుత్వ విదేశాల నుండి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వలన దేశీయంగా కొబ్బరి రైతులకు కనీసం ధరలు రావడం లేదని పేర్కొన్నారు. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానం ఉండగా దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉందన్నారు. కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నా అనేక సంవత్సరాలుగా ఎర్రనల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు వలన దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కొబ్బరికాయకు రైతుకు రూ.8 నుండి రూ.10 లు మాత్రమే ధర వస్తోందని, చెట్టు నుండి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.3లకు పైగా ఖర్చు అవుతున్నదని వాపోయారు. రైతు చేతికి కాయకు రూ.5 మించి ధర రావడం లేదు. పెరిగిన ఖర్చులరీ రీత్యా ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతున్నది. మార్కెట్ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *