fbpx

టిడిపి,జనసేన లను విమర్శించేందుకే సిఎం సభ : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,750 రూపాయలు ఉన్న పింఛను మరో 250 రూపాయలు పెంచేందుకు కాకినాడ వచ్చారని ఇది నాలుగున్నర ఏళ్ల క్రితమే చేయవలసిన పనని,ఇప్పుడు చేయడం వలన ప్రతి పింఛనుదారుడికి 18 వేల రూపాయలు సీఎం బకాయి పడ్డారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే సీఎం జగన్ చేసిన కాకినాడ పర్యటన వల్ల రెండు కోట్ల రూపాయలు లోటులోకి వెళ్లిందని చలోక్తి విసిరారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో వనమాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో సీఎం జగన్ పింఛన్ పెంపు కార్యక్రమ సంబంధించి భారీ సభను ఏర్పాటు చేశారని, దీనికి పించనుదారులను బెదిరించి తీసుకు వచ్చారన్నారు. సీఎం కేవలం ఎన్నికల పర్యటనకు వచ్చినట్టుగానే ఉందని అందులో కాకినాడ అభివృద్ధిపై ఏమి మాట్లాడలేదన్నారు.

కాకినాడ నగరానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు, ప్రాజెక్టులు ఆగిపోయాయని వాటిలో ఏ ఒక్కటి మీద కూడా స్పందించలేదన్నారు. కాకినాడ నగరంలో కమాండ్ కంట్రోల్ రూమ్, సర్పవరం నుండి పోర్టుకు రోడ్డు, 216 రహదారి, సాగరమాల, వార్డుల అభివృద్ధి వంటివి మాట్లాడకుండా కేవలం టీడీపీ- జనసేనని విమర్శించేందుకు మాత్రమే వచ్చారన్నారు. ఇలా పవన్, బాబును విమర్శించేందుకు సభ పెట్టి రెండు కోట్ల ఖర్చు పెట్టడం అన్యాయమన్నారు. ఎన్నికల కోసం అభ్యర్థులను మార్చుతున్నారని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని, ఆయన్ను ఎందుకు మార్చడం లేదో సీఎం జగన్ జవాబు చెప్పాలన్నారు. అందరికంటే ఎక్కువ తప్పులు చేసిన ద్వారంపూడిని ఎందుకు వెనకేసుకొస్తున్నారో సీఎం జగన్ కారణం తెలపాలన్నారు. కాకినాడ నగరానికి చెందిన వాళ్లకు ఇళ్లను ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, ఎమ్మెల్యే ద్వారంపూడిలు అక్కడ ఎంతమంది నిర్మాణం చేపట్టారో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.కాకినాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదో కూడా ద్వారంపూడి చెప్పాలన్నారు. ఈ సభ వల్ల కాకినాడ ప్రజలకు, అభివృద్ధికి ఎటువంటి ఉపయోగం లేకపోయిందన్నారు.

కాకినాడ నగరంలో నేడు సీఎం ప్రారంభించిన ప్రాజెక్టులన్ని తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేసినవేనని గుర్తు చేశారు. తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో పాదయాత్ర చేసిన జగన్.. తాను అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే స్వేచ్ఛగా తిరిగేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాకినాడ ప్రజలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని కాకినాడ అభివృద్ధి టీడీపీతో సాధ్యమవుతుందని వనమాడి చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, గుజ్జు శ్రీధర్ రెడ్డి, మూగు రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *