fbpx

ఆత్మస్తుతి పరనింద”వలే సిఎం ప్రసంగం: సిపిఎం

Share the content

చాలా కాలం తర్వాత కాకినాడ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం ఆశించిన స్థాయిలో లేదని ఆత్మ స్తుతి పరనింద లా సాగింది సిపిఎం కాకినాడ నగర కన్వీనింగ్ కమిటీ విమర్శించింది. ఈ మేరకు సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్నాధపురం లో తాగునీటి సమస్య పరిష్కారానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కోరిన విధంగా 47 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. అయితే కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల గురించి గాని, కాకినాడ అభివృద్ధి గురించి గాని, యువతకు ఉపాధి కల్పన గురించి గాని సిఎం ప్రస్తావించక పోవడం విచారకరమన్నారు. సిఎం ప్రసంగం లో కొన్ని మీడియా సంస్థలను పదేపదే విమర్శించడం సమంజసంగా లేదన్నారు. 2014 – 19 ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం వల్లనే ప్రస్తుత పాలకులకు ప్రజలు అవకాశం కల్పించారని గమనించాలన్నారు. మరలా తమనే ఎన్నుకోవాలని పదేపదే ప్రజలను కోరినా.. ముఖ్యమంత్రి మరోసారి అవకాశం ఇస్తే ప్రజలకు ఏమి మేలు జరుగుతుందో చెప్పలేదని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు గాని, స్కీం వర్కర్స్ కి గాని అందడం లేదని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. అలాగే విపరీతంగా వస్తున్న విద్యుత్ బిల్లులు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, నగరాల్లో చెత్త పన్ను, ఆస్తిపన్నుల నుండి సామాన్య మధ్యతరగతికి ఏవిధంగా ఉపశమనం కలిగిస్తారో ప్రసంగంలో చెప్పి ఉంటే బావుండేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్, సమగ్ర శిక్షాభియాన్ ఉద్యోగుల సమ్మెల గురించి సిఎం ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో అవినీతి లేదని సిఎం ప్రసంగించడం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మొత్తంగా కాకినాడ లో సిఎం ప్రసంగం ఆత్మస్తుతి పరనింద లా సాగిందని పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *