fbpx

కాకినాడ సిటీ నుంచి కొండబాబు నామినేషన్ దాఖలు

Share the content

కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్ ధాఖలు చేశారు. జగన్నాధపురం కొండబాబు స్వగృహం నుండి కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు, బిజెపి నాయకులు పైడా భవన్ ప్రసాద్, గట్టి సత్యనారాయణ, తోట సుధీర్ తదితర నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. చర్చి స్క్వేర్ సెంటర్, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎన్టీఆర్ బ్రిడ్జ్, వార్ఫ్ రోడ్డు మీదుగా సినిమా రోడ్డు, సంత చెరువు కల్పనా సెంటర్ మీదుగా కొత్తపేట బ్రిడ్జి, కోకిల సెంటర్, భానుగుడి సెంటర్ మీదుగా కమిషనర్ కార్యాలయం చేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా కొండబాబు స్వగృహం నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అడుగడుగునా కొండబాబుకి నగర ప్రజలు తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు అభిమానులు పూలమాలతో హారతులతో బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగిన నామినేషన్ తో కాకినాడ నగరం పసుపు మయంగా మారింది.

నామినేషన్ అనంతరం కాకినాడ సిటి ఎన్డీయే అభ్యర్థి కొండబాబు మాట్లాడుతూ….. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానుల మద్దతుతో నామినేషన్‌ దాఖలు చేశామని తెలిపారు. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి గెలుపుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. గత తెలుగుదేశ ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్ర సహకారాలతో కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకువచ్చి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.టిడిపి ప్రభుత్వంలో కాకినాడ నగరం స్మార్ట్ సిటీ నగరంగా పిలవబడిందని తెలిపారు. వైసిపి ఐదేళ్ల పాలనలో కాకినాడ నగర అభివృద్ధి మరుగును పడింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీని, ఎమ్మెల్యే ద్వారంపూడి గంజాయి సిటీగా మార్చేశారని ధ్వజమెత్తారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో నగరాన్ని గంజాయి డ్రగ్స్ మూలాల రహిత నగరంగా మార్చి, స్మార్ట్ సిటీకి పూర్వ వైభవం తీసుకువఇస్తామని హామీ ఇచ్చారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ద్వారంపూడి అరాచక పాలనలో భూకబ్జాలు, దోపిడీలు, రౌడీలు, గుండాల ముఠాలకు అడ్డాగా మారిందని విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, గ్రంధి నారాయణరావు, సంగిశెట్టి అశోక్, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *