fbpx

కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : కాపు జేఏసి

Share the content

కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్ర కాపు జేఏసి డిమాండ్ చేసింది. శుక్రవారం కాకినాడ విద్యుత్ నగర్ లోని వెంకన్న బాబు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కాపు, తెలగ,బలిజ, ఒంటరి కులాల జేఏసి నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జేఏసి నేతలు వాసిరెడ్డి , ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, అరేటి ప్రకాష్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రకటించిన కాపు కార్పొరేషన్ నిధులు ఏడాదికి 2వేల కోట్ల చొప్పున 5 ఏళ్లకు 10వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ జీవోను అమలు చేయాలని పేర్కొన్నారు. కులాల వారీగా కులగణన చేపట్టి రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి దామాషా పద్ధతి ప్రకారం విద్యా, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు.

నూతనంగా ఏర్పడిన జిల్లాలకు కాపు ప్రముఖులు దివంగత వంగవీటి రంగా, పెరియార్ రామస్వామి, కన్నెగంటి హనుమంతు, శ్రీకృష్ణదేవరాయల పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. కాపులను వెనకబడి వర్గాలుగా ఎఫ్ కేటగిరీలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వం బిల్లును అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు కార్పొరేషన్ బలోపేతం చేయాలని దానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. చట్టసభల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రాతినిద్యం కల్పించాలని కోరారు. కాపులకు చేయాల్సిన పనులను మాని తమలో తమకే విభేదాలు, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను డిమాండ్లను, ప్రాతినిధ్యం కల్పించిన పార్టీలకు మద్దతు ఉంటుందని ఏసుదాసు, రామకృష్ణలు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలత తెలపని పక్షంలో జనవరి మూడో తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాపు నాయకులు బసవా ప్రభాకర రావు,చిట్నీడి శ్రీనివాస్, దామిశెట్టి శ్రీను, అడబాల సత్యనారాయణ, జంక్షన్ బాబ్జి, కొప్పిశెట్టి శ్రీను, జ్యోతి వీరకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *