fbpx

జేపీ స్వరం మారుతోంది!

Share the content

ఒకప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న ఐఏఎస్ అధికారిగా, ఒక పార్టీని నిజాయితీగల పార్టీగా ముద్ర వేయించుకున్న నాయకుడిగా జయప్రకాష్ నారాయణ కు మంచి పేరు ఉంది. అయితే ఆయన ఇటీవల వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. గతంలో జగనన్న విద్యా పథకం మీద తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష మీద జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ చాలా మంచి పథకం అంటూ కితాబు ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న జగనన్న సురక్ష పథకాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే మాజీ ఐఏఎస్ అధికారి హోదాలో జయప్రకాష్ నారాయణ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అన్నది సగటు ఆంధ్ర ప్రజానీకం మాట.

** లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడిగా అందరికీ సుపరిచితమై కచ్చితంగా రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగిన నాయకుల్ని ఎన్నుకోవాలి అంటూ ఒకప్పుడు రకరకాల సూక్తులు చెప్పిన జయప్రకాష్ నారాయణ ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన దగ్గర నుంచి ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ జయప్రకాష్ నారాయణ దగ్గరికి వెళ్లి మరి భుజం మీద చేయి వేసి మాట్లాడారు. వారిద్దరి మధ్య కొన్ని ఆసక్తికర సంభాషణలు కూడా జరిగినట్లు పక్కన ఉన్నవారు చెప్పడం ద్వారా తెలిసింది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ టికెట్ రేసులో జయప్రకాష్ నారాయణ కు అనుకూలంగా సీఎం మాట్లాడినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ టికెట్ను ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం రివాజు గా వస్తోంది. 2019 ఎన్నికల్లో పొట్లూరు వరప్రసాద్ వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆయన టిడిపి ఎంపీ కేసినేని చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత మళ్లీ పివిపి వైసిపి కార్యక్రమాల్లో గాని విజయవాడలో గాని పెద్దగా కనిపించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలి అన్న అంశం మీద జగన్ స్థాయిలో అయోమయం నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో జయప్రకాష్ నారాయణ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి రావడం ఆయనను జగన్ ఆప్యాయంగా పలకరించి విజయవాడ నుంచి మీరు ప్రతినిత్యం వహిస్తే బాగుంటుంది అని ప్రతిపాదించడం జరిగిపోయింది అన్నది అప్పట్లోనే ప్రచారం జరిగింది. దీనికి జేపీ కూడా నవ్వుతూ తర్వాత మాటల్లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ మాట వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అధినాయకత్వం జేపీతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి జెపి పోటీ చేయాలి అని వైసిపి నేతలు కోరుతున్నారు. దీనికి జేపీ పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకపోయినాప్పటికీ ఇటీవల వైసిపికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్న తీరు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి జేపీ పోటీలో ఉండవచ్చు అన్న సందేహానికి మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి దీనిపై ఇప్పటికిప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *